Aims: కొవిడ్-19 టీకాల భద్రతపై ఇటీవల ఉత్పన్నమైన సందేహాలను వైద్య నిపుణులు మరియు టీకా తయారీ సంస్థలు ఖండించాయి. ఆకస్మిక గుండెపోటులు, మరణాలకు టీకాల వల్లే కారణమని వస్తున్న ప్రచారంలో నిజం లేదని వారు స్పష్టం చేశారు. భారత వైద్య పరిశోధన మండలి (ICMR), ఎయిమ్స్ నిర్వహించిన రెండు విభిన్న అధ్యయనాల్లోనూ టీకాల వల్ల గుండె సంబంధిత ముప్పు లేదని తేలిందని నిపుణులు పేర్కొన్నారు.
కర్ణాటక హసన్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 20 మందికిపైగా గుండె సంబంధిత కారణాలతో మృతి చెందడంతో టీకాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఎయిమ్స్ వైద్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా మాట్లాడుతూ, “యువతలో ఆకస్మిక మరణాలపై చాలా అధ్యయనాలు జరిగాయి. టీకాలు, గుండెపోటుల మధ్య సంబంధం ఏ పరిశోధనలోనూ రుజువవలేదు. ఇతర ఔషధాల్లానే కొన్ని తేలికపాటి దుష్ప్రభావాలు ఉన్నా, అవి ప్రాణాంతకంగా ఉండవు,” అని వివరించారు.
ఎయిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ICMR, ఎయిమ్స్ అధ్యయనాల ప్రకారం టీకాలు గుండెపోటు ముప్పును తగ్గిస్తున్నాయే తప్ప, పెంచడం లేదు. వ్యాక్సిన్ వల్ల ప్రయోజనమే మిగిలిందని తేలింది” అని అన్నారు.
అకస్మిక మరణాలకు యువత జీవనశైలి, శారీరక వ్యాయామం లోపం, మధుమేహం, రక్తపోటు వంటి కారణాలే ప్రాథమికంగా ఉన్నాయని, వ్యాక్సిన్‌కి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. భారత్‌లో తయారవుతున్న టీకాలు పూర్తిగా సురక్షితంగా ఉండటమే కాకుండా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది.