Adilabad: ఎల్లుండి ఆదిలాబాద్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సోయా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యత లేదని చూపుతూ గోడౌన్ ఇన్ఛార్జ్లు ఇప్పటికే కొనుగోలు చేసిన సోయా పంటను తిరిగి పంపిస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఇప్పటివరకు 2,700 సోయా బస్తాలను రిటర్న్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా మరో మూడు లారీల్లో తీసుకొచ్చిన సోయా పంటను కూడా అధికారులు రిజెక్ట్ చేశామని చెబుతున్నారు. ఈ నిర్ణయాలతో రైతులు అయోమయంలో పడిపోయారు.
రైతుల సమస్యలపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ, రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రకటించింది. నాణ్యత పేరుతో రైతులను వేధించడం తగదని, తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
