Actress Hema: గత ఏడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని తీవ్ర వివాదంలో చిక్కుకున్న నటి హేమకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసును హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న హేమ, ఈ విజయం సాధించిన సమయంలోనే తన తల్లి మరణాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఫేక్ న్యూస్ వల్లే అమ్మ మరణం
కేసును కోర్టు కొట్టివేసిన విషయాన్ని ప్రకటిస్తూ హేమ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ గెలుపు ఒకవైపు సంతోషాన్ని ఇచ్చినా, తన తల్లి మరణం తీరని విషాదాన్ని మిగిల్చిందని ఆమె అన్నారు. తనపై సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారం (ఫేక్ న్యూస్) మరియు ట్రోలింగ్ వల్లే తన తల్లి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేకనే ఆమె మృతి చెందారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. “ఫేక్ న్యూస్, ట్రోలింగ్ మా అమ్మను చంపేశాయి. నాపై వచ్చిన నిందలను ఆమె తట్టుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురై స్ట్రోక్‌తో చనిపోయారు,” అంటూ హేమ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read: Chiranjeevi: అనిల్ రావిపూడిపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు!
కోర్టు తీర్పు..
గతేడాది బెంగళూరులో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలు తీసుకున్నారన్న ఆరోపణలతో నటి హేమపై కేసు నమోదైంది. అయితే, నవంబర్ 3వ తేదీనే కర్ణాటక హైకోర్టు తనపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందని హేమ తెలిపారు. జడ్జిమెంట్ కాపీ అందే వరకు ప్రకటించకూడదనే కారణంతో ఇప్పటివరకు వేచి చూసినట్లు ఆమె చెప్పారు.
“నేను ఏ తప్పూ చేయలేదని మొదట్నుంచీ చెబుతున్నా. ఇప్పుడు కేసు గెలిచా, నిర్దోషిని అని రుజువైంది. కానీ మా అమ్మ లేదు. నా గురించి తప్పుగా రాసిన వారంతా ఇప్పుడు నాకు అమ్మను ఇవ్వగలుగుతారా?” అని ప్రశ్నిస్తూ, ఏడాదిన్నరగా తాను అనుభవించిన మానసిక క్షోభను హేమ వ్యక్తం చేశారు. తాను డ్రగ్స్ ఆరోపణలను తట్టుకోలేకపోయినా, తన తల్లే తన బలం అని, ఆమె తనపై వచ్చిన తప్పుడు వార్తలను జీర్ణించుకోలేకపోయారని హేమ తెలిపారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హేమకు ఈ కోర్టు తీర్పు ఊరటనిచ్చింది.
