Telangana

Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. షెడ్యూల్ నేడు విడుదల

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,13,534 వార్డులకు ఎన్నికల షెడ్యూల్‌ను నేడు (మంగళవారం) సాయంత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సాయంత్రం 6:00 గంటల నుంచి 6:15 గంటల మధ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించనుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మీడియా సమావేశంలో ఈ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ షెడ్యూల్ విడుదలైన తక్షణమే రాష్ట్రంలోని 545 గ్రామీణ మండలాల్లోని 12,733 గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.

మూడు విడతల్లో ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అందిన సమాచారం మేరకు, ఈ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అనుమతి లభించడంతో, పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం కలిసి ఏర్పాట్లు పూర్తి చేశాయి.

నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 27న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు.
మొదటి విడత పోలింగ్: డిసెంబర్ 11న జరగనుంది.
పోలింగ్ సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
ఓట్ల లెక్కింపు: పోలింగ్ ముగిసిన వెంటనే, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

మొదటి విడత పోలింగ్ జరిగిన నాలుగు రోజుల తేడాతో డిసెంబర్ 15, డిసెంబర్ 19 తేదీల్లో రెండు, మూడు దశల ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రకటనలో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.

Also Read: Ethiopia: భార‌త్‌పై ఇథియోఫియా అగ్నిప‌ర్వ‌తం లావా ఎఫెక్ట్‌

హైకోర్టులో విచారణ
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై నేడు మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరపనుంది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు వెల్లడించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అడ్వొకేట్ జనరల్‌కు నివేదిక సమర్పించింది. ఈరోజు జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుని ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని మొత్తం 545 మండలాల్లో ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సిబ్బంది ఎంపిక, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అన్ని సన్నాహాలను ఎన్నికల సంఘం పూర్తి చేసింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *