Narendra Modi: శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని, ఆయన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని, పుట్టపర్తి పవిత్రభూమి అని పేర్కొన్నారు.
సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్న ప్రధాని, సత్యసాయి భౌతికంగా లేకపోయినా, ఆయన ప్రేమ మనతోనే ఉందని, ఆయన విశ్వప్రేమకు ప్రతిరూపంగా జీవించారని అన్నారు. “అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు” అనే బాబా నినాదం విశ్వశాంతి, విశ్వసేవలను మనకు చాటి చెప్పిందని మోదీ వివరించారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని, భారతీయ నాగరికతకు సేవే మూల కేంద్రమని, భక్తి, జ్ఞానం, కర్మ అనే మూడు సేవతోనే ముడిపడి ఉంటాయని ప్రధాని వివరించారు. సత్యసాయి సందేశం పుస్తకాలకు, ప్రవచనాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరించి ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: SS Rajamouli: సంచలన డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు
ఈ సందర్భంగా సత్యసాయి సేవలను స్మరించుకుంటూ ప్రధాని మోదీ రూ. 100 స్మారక నాణెం మరియు నాలుగు తపాలా బిళ్లలను ఆవిష్కరించారు.
సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, ఆయన ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేసి, వారి జీవితాలను సమూలంగా మార్చేశాయని ప్రధాని అన్నారు. కోట్లమంది బాబా భక్తులు ఈ రోజు మానవసేవ చేస్తున్నారని, గుజరాత్ భూకంపం వంటి సమయాల్లో కూడా బాబా సేవాదళ్ అందించిన సేవలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. సత్యసాయి తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని ప్రశంసించారు.
ఈ వేదికపైనే, ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావిస్తూ.. “బాలికల ప్రగతిలో సురక్ష సమృద్ధి యోజన కీలకమైంది. ఈ రోజు 20 వేల మంది బాలికలకు సురక్ష సమృద్ధి యోజన అందించాము,” అని ప్రధాని తెలిపారు. అలాగే, గరీబ్ కల్యాణ్ యోజన లబ్దిదారుల సంఖ్య వంద కోట్లకు చేరుకుందని వివరించారు.
