Atchanaidu: విశాఖపట్నంలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్ రవాణా కేసు వెలుగులోకి వచ్చింది. బెంగళూరు నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో విశాఖపట్నానికి అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తున్న చరణ్ అనే యువకుడిని ఈగల్ టీమ్, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం 36 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో, ఈ డ్రగ్స్‌ను వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డికి అందించడానికి తెచ్చినట్టు బయటపడింది. అనంతరం పోలీసులు కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు.”రాష్ట్ర ప్రభుత్వం యువతను డ్రగ్స్ ముప్పు నుంచి రక్షించేందుకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ ప్రత్యేక ప్రచారం చేస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆ పార్టీ ఎంత ప్రమాదకరమో నిరూపిస్తున్నాయి,” అని ఆయన వ్యాఖ్యానించారు.
అచ్చెన్నాయుడు వైసీపీపై నిప్పులు చెరిగి, నేరంతో పార్టీ నేతలకున్న సంబంధం మరోసారి బయటపడిందని విమర్శించారు. యువత భవిష్యత్తును హరిస్తున్న ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
