Minister Savitha: పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారని రాష్ట్ర మంత్రి సవిత తీవ్రంగా విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించి, ఆ నిందను టీడీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
“వైసీపీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి కార్యక్రమానికి ఆయన కుమార్తె సునీత కూడా హాజరు కావడానికి భయపడుతున్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న దాడుల వెనుక వైసీపీ నేతలే ఉన్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు,” అని మంత్రి సవిత తెలిపారు.
పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. “గత ఏడాది నుంచి ప్రశాంత వాతావరణం నెలకొంది. సూపర్‌సిక్స్ పథకాలపై ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. ఈ సానుకూలతలతో రెండు స్థానాలూ టీడీపీ దక్కించుకుంటుంది. ఈ నిజాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ధర్నాలు, బెదిరింపులు చేస్తున్నారు,” అని వ్యాఖ్యానించారు.
‘జగన్ రప్పా.. రప్పా’ వంటి నినాదాలు, అసభ్యకర వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలను ఎదుర్కొంటుందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
