Starlink: భారతదేశంలో శాటిలైట్ ఆధారిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థకు కీలక అనుమతులు లభించాయి. ఈ సంస్థకు చెందిన స్టార్‌లింక్‌కు దేశీయంగా శాట్‌కామ్ లైసెన్స్ మంజూరయ్యింది. ఈ నేపథ్యంలో స్పేస్‌ఎక్స్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. భారత్‌లోని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్‌ను విస్తరించాలనే లక్ష్యంతో స్టార్‌లింక్ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
సింధియాతో గ్వినే షాట్‌వెల్ సమావేశం
ఈ నేపథ్యంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్వినే షాట్‌వెల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలవంతంగా జరిగిందని సింధియా పేర్కొన్నారు. భారత్‌లో స్టార్‌లింక్‌కు లైసెన్స్ మంజూరు చేయడంపై గ్వినే ప్రశంసలు కురిపించారని ఆయన తెలిపారు.
సమావేశం అనంతరం మంత్రి ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ, “డిజిటల్ ఇండియా లక్ష్యాల కోసం శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో సహకార అవకాశాలపై మేం చర్చించాం. భారతదేశంలో కనెక్టివిటీ విస్తరణకు ఇది కీలకమైన అడుగు” అని తెలిపారు.
డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజలో
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ డిజిటల్ విప్లవంలో దూసుకుపోతోంది. ఇలాంటి వేళ శాటిలైట్ ఆధారిత సాంకేతికతలు కేవలం ఉపయోగకరమైనవే కాదు, పరివర్తనాత్మకమైనవిగా నిలుస్తున్నాయి” అని సింధియా అభిప్రాయపడ్డారు. స్టార్‌లింక్‌కు లైసెన్స్ మంజూరు ఈ దిశగా గొప్ప ముందడుగని వ్యాఖ్యానించారు.
స్టార్‌లింక్ లక్ష్యం – మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్
తక్కువ భూకక్ష్య ఉపగ్రహాల (Low Earth Orbit Satellites) ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడమే స్టార్‌లింక్ ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే సంస్థ శాట్‌కామ్ లైసెన్స్ పొందగా, వాణిజ్య సేవలు 2024 చివర లేదా 2025 ప్రారంభంలో ప్రారంభించే అవకాశముంది.
జీఎంపీసీఎస్ అనుమతి – కీలక ఘట్టం
టెలికం శాఖ (DoT) ఇప్పటికే స్టార్‌లింక్‌కు జీఎంపీసీఎస్ (Global Mobile Personal Communication by Satellite) అనుమతిని మంజూరు చేసింది. దేశంలో యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో-ఎస్ఈఎస్ తర్వాత జీఎంపీసీఎస్ అనుమతి పొందిన మూడవ శాట్‌కామ్ సంస్థగా స్టార్‌లింక్ నిలిచింది.
ఇన్-స్పేస్ ఆమోదం తదుపరి దశ
శాటిలైట్ ఇంటర్నెట్ సేవల పూర్తి ప్రారంభానికి ముందు, స్టార్‌లింక్ సంస్థకు ‘ఇన్-స్పేస్’ (Indian National Space Promotion and Authorization Center) నుండి అనుమతి అవసరం. ఇప్పటికే అవసరమైన పత్రాలను సంస్థ సమర్పించినట్టు తెలిసింది. అంతేకాక, భద్రతా ప్రమాణాలను పాటించినందున త్వరలో ట్రయల్ స్పెక్ట్రమ్‌ను కూడా కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
