AP News: గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మయే శ్రీ గురువేనమః.. అని వేదకాలం నుంచే మనం ఈ మాటలు వింటూ ఉన్నాం. తల్లిదండ్రుల తర్వాత గురువు దైవసమానులని మన పూర్వీకుల నుంచి భావిస్తూ వస్తున్నాం. కానీ, ఇటీవల కొందరు విద్యార్థులు ఏకంగా గురువులను హేళన చేస్తూ, కించ పరుస్తూ వస్తున్నారు. దాడులు దౌర్జన్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి.
AP News: కానీ, నిన్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటనపై యావత్ ప్రపంచమంతా నివ్వెర పోయింది. గురువు అనే స్థానం ఎక్కడికి దిగజారిందో దీన్నిబట్టే మనకు అర్థమవుతుంది. తన అధ్యాపకురాలిని ఆమె విద్యార్థిని ఏకంగా చెప్పుతో కొట్టిన ఘటనను కొందరు వీడియో తీసి పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. ఆ వీడియో చూసిన ప్రతి నెటిజన్ ఆ యువతిని, ఆమె తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. ఇంతగా దిగజరిందా గురుస్థానం.. అని ఎందరో చింతించసాగారు.
AP News: ఏపీలోని విజయనగరం జిల్లా కేంద్రం సమీపంలోని రఘు ఇంజినీరింగ్ కళాశాలలో తరగతి గదిలోకి ఫోన్ తేవడంపై ఆ అధ్యాపకురాలు అభ్యంతరం తెలిపారు. దానికి ఆ విద్యార్థిని ఏకంగా ఆ ఆధ్యాపకురాలిని అనరాని మాటలంటూ చెప్పు తీసుకొని ఆమెపై దాడి చేసింది. ఈ సమయంలో ఆ అధ్యాపకురాలు నిశ్చేష్ఠురాలై నివ్వెరపోయింది. ఆ తర్వాత తేరుకొన్న ఆ అధ్యాపకురాలు కూడా ఆ విద్యార్థినిపై తిరిగి కొట్టింది. ఇద్దరూ కలియబడితే తోటి విద్యార్థినులు, అధ్యాపకులు వారించారు.
AP News: ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటి పిల్లలు గురువులను చెప్పుతో కొట్టేస్థాయికి దిగజారిపోయారు.. ఎటు పోతుంది ఈ సమాజం.. అంటూ ఎవరికి వారు ప్రశ్నలు వేసుకున్నారు. అయితే ఈ వీడియో రాష్ట్రమంతటా వైరల్ కావడంతో ఆ అధ్యాపకురాలు మనస్తాపం చెందారు. దీంతో తన ఉద్యోగానికి ఆమె రాజీనామా చేశారు.
AP News: తోటి అధ్యాపకులు వారించినా వినకుండా ఆమె కళాశాల యాజమాన్యానికి తన రాజీనామా లేఖను అందించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రఘు విద్యాసంస్థల చైర్మన్ రఘు, ఇతర ఫ్యాకల్టీలతో సమావేశమైనట్టు సమచారం. అధ్యాపకురాలిని చెప్పుతో కొట్టిన విద్యార్థిని తల్లిదండ్రులను కళాశాలకు రావాల్సిందిగా సమాచారం ఇచ్చినా, ఇప్పటివరకూ వారు రాకపోవడం గమనార్హం. చివరకు చెప్పేదేమిటి? అంటే గురువు అంటే దైవంతో సమానమని నేత విద్యార్థిలోకం గుర్తించాలని కోరుతున్నాం.

