Telangana Budget 2025

Telangana Budget 2025: రేవంత్ ముందే చెప్పారు… వాస్తవ బడ్జెట్ ప్రవేశ పెట్టారు

Telangana Budget 2025: ముందు నుంచీ చెప్తున్నట్లే…. వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టి…. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొత్త పంథాకు శ్రీ‌కారం చుట్టింది. భారీ అంచ‌నాల‌కు పోకుండా…. రాష్ట్ర ఆర్థిక దీన ప‌రిస్థితి ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని…. ఆచితూచి బ‌డ్జెట్‌కు రూప‌క‌ల్ప‌న చేసింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా…. కేవ‌లం 7 శాతం అంచ‌నాలు పెంచి…. ఊహ‌ల ప‌ల్లికిలో ఊగ‌కుండా…. కాస్త త‌గ్గి ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించింది.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం 2024-25 వార్షిక బ‌డ్జెట్ రూ. 2.91 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ఈ సారి రూ.3.15 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.3.30 ల‌క్ష‌ల కోట్ల‌కు ఎస్టిమేట్ బ‌డ్జెట్ అంచ‌నా వేస్తార‌ని భావించారు. కానీ అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా తెలంగాణ స‌ర్కార్ 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను కేవ‌లం రూ.3.04 ల‌క్ష‌ల కోట్ల‌కే ప‌రిమితం చేసింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల కాలంలో ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని చెబుతూ.. బ‌డ్జెట్ సైజు త‌గ్గ‌వ‌చ్చ‌నే విధంగా ప‌రోక్షంగా హింట్ ఇస్తూ వ‌చ్చారు. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఎంత కాద‌న్నా.. రూ.3.10 ల‌క్ష‌ల కోట్ల‌కు బ‌డ్జెట్ తగ్గదని భావించారు.

ప్రభుత్వం మాత్రం చాలా త‌క్కువ అంచ‌నాల‌తో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంద‌ని ముందే వెల్ల‌డించింది. ఈ బ‌డ్జెట్ పెన్ష‌న‌ర్ల‌కు టెన్ష‌న్ మిగిల్చింది. 2 వేల పింఛ‌న్ 4 వేలకు పెంచుతామ‌న్న హామీని ప్ర‌భుత్వం నిల‌బెట్టుకోలేక‌పోయింది. మ‌హిళ‌ల‌కు మ‌హాల‌క్ష్మీ కింద 2500 ఇస్తామ‌న్న విష‌యాన్ని, నిరుద్యోగ భృతిని బ‌డ్జెట్‌లో ఎక్క‌డా పేర్కొన‌లేదు. రైతుబంధు, చేయూత‌, మ‌హాల‌క్ష్మీ, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇల్లు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసాకు కేవ‌లం రూ.56 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. 6 గ్యారెంటీల‌ అమ‌లుకు క‌నీసం రూ.80 వేల కోట్లు కావాలి. ఇదిలా ఉండ‌గా.. రైతు భరోసా రూ.18 వేల కోట్లు కేటాయించింది. ప్ర‌స్తుత సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు మ‌రో రూ.ల‌క్ష కోట్లు కేటాయించారు.

ఇక బీసీల‌కు గ‌త స‌ర్కార్ కంటే కొంత న‌యంగా రూ.11 వేల కోట్లు కేటాయించింది రేవంత్‌ సర్కార్‌. బ‌డ్జెట్‌లో భారీ అంచ‌నాలు లేక‌పోయినా గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌నే ఈ ప్ర‌భుత్వం కూడా కొన్నింటిని పున‌రావృతం చేసింది. బ‌డ్జెట్‌ను కొంత పెంచి చూప‌డానికి కృత్రిమ ఎత్తుగ‌డ‌ల‌ను ప్ర‌యోగించింది. ప‌న్నేత‌ర రాబ‌డిని ఎకాఎకిన రూ.31 వేల కోట్లకు పెంచి చూపింది. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ప‌న్నేత‌ర రాబ‌డి రూ.10 వేల కోట్ల‌కు మించ‌డం లేదు. ఆ మాట‌కు వ‌స్తే ఈ ఏడాది ప‌న్నేత‌ర రాబడి రూ.6 వేల కోట్లు మాత్ర‌మే ఉంది. కాబట్టి ఏకంగా రూ.20 వేల కోట్లు పెంచి చూపిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. ప్ర‌భుత్వం ఇసుక త‌ర‌లింపు, గ‌నుల త‌వ్వ‌కాలు వంటి వాటిపై దృష్టి సారించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈసారి రాబ‌డి మ‌రింత త‌గ్గింది.

ఇది కూడా చదవండి: KTR on Budget 2025: పేదల కష్టాలను తీర్చేలా లేదు.. కాంగ్రెస్ బ‌డ్జెట్‌పై కేటీఆర్ ఫైర్

గ‌తంలో లాగే ఈసారి కూడా భూముల వేలంపై స‌ర్కార్ ఆశ‌లు పెట్టుకుంది. బీఆరెస్ స‌ర్కార్ ప‌త‌కానికి ముందు ఎన్నిక‌ల హామీల‌లో భాగంగా రుణ‌మాఫీ చేయ‌డానికి కోకాపేట భూముల‌ను అమ్మి తంటాలు ప‌డింది. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అదే బాట‌లో గ‌చ్చిబౌలి భూముల‌ను వేలం వేస్తోంది. ఇంకా… ఆశ‌లే లేని కేంద్ర ప్రాయోజిక ప‌థ‌కాల కింద రావాల్సిన గ్రాంట్ల‌కు రూ.22 వేల కోట్లు వ‌స్తుందని అంచ‌నా వేసింది. కానీ నిజానికి అది రూ.5 వేల కోట్ల‌కు మించ‌డం లేదు.

సొంత ప‌న్నుల రాబ‌డి ఈసారి 1.45 ల‌క్ష‌ల కోట్లుగా రావ‌చ్చ‌ని అంచ‌నా వేసింది. ఈ రాబ‌డి కాస్తా అటూ ఇటూగా ఉన్నా బ‌డ్జెట్‌లో కొంత పెంచి చూపార‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే సొంత ప‌న్నుల రాబ‌డి ఆశాజ‌న‌కంగా ఉన్న‌ప్ప‌టికీ సంక్షేమ ఖ‌ర్చు విప‌రీతంగా పెరిగిపోతోంది. ఆదాయానికి, వ్య‌యానికి మ‌ధ్య భారీ తేడా క‌నిపిస్తోంది. దాదాపు రూ.70 వేల కోట్ల రూపాయ‌ల ద్ర‌వ్య‌లోటు క‌నిపిస్తోంది.

ఒకే ఒక ఆశ ఏమిటంటే.. కేంద్ర ప‌న్నులలో రాష్ట్ర వాటాగా వ‌చ్చే మొత్తం పెరుగుతోంది. ప్ర‌స్తుత సంవ‌త్స‌రం రూ.25 వేల కోట్లు స‌మ‌కూరుతుంద‌ని భావించగా, అది ఈ సారి రూ.26 వేల కోట్లు దాటింది. జీఎస్టీ త‌రువాత మ‌ద్యం ఆదాయం అంతో ఇంతో ఆదుకుంటోంది. మ‌ద్యం ప్ర‌త్య‌క్ష అమ్మ‌కాలు, వ్యాట్ ప‌న్ను విధింపు ద్వారా అబ్కారీ శాఖ నుంచి ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా రూ.40 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది.

ఇక రాష్ట్ర ప‌రిస్థితి బాగా లేకున్నా.. ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం బాగా పెరుగుతున్న‌దని సోషియో ఎకాన‌మీ స‌ర్వేలో వెల్ల‌డించింది. రాష్ట్ర మొత్తం స్థూల ఉత్ప‌త్తి, మొత్తం సంప‌ద ఈసారి ప‌ది శాతానికి పెంచుతూ అంచ‌నా వేసింది. అయితే గ‌త సంవ‌త్స‌రం రూ.15 ల‌క్ష‌ల కోట్లుగా ఉన్న జీఎస్‌డీపీకి ఈసారి రూ.16.50 ల‌క్ష‌ల కోట్ల‌కు అంచ‌నా వేసింది. దీని ద్వారా 3 ల‌క్ష‌లుగా ఉన్న ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం రూ.3.30 ల‌క్ష‌ల‌కు పెరిగింది.

ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్‌ను రైతు సంక్షేమ బడ్జెట్‌గా అభివర్ణించారు. ఆయా వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశామని గణాంకాలు వివరించారు. వాస్త‌వానికి కొంత ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో భట్టి బడ్జెట్ ఈసారి భిన్నంగా క‌నిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *