LRS Scheme: ఎల్ఆర్ఎస్ పథకం అమలులో ఏం జరిగింది? నాడు విభేదించి, నేడు ఆమోదించచడం వెనుక కారణాలేంటి? భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉచితం అని..అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత రాయితీ కల్పిస్తామని ప్రకటించడం సరైనదేనా? అసలు ఎల్ఆర్ఎస్ స్కీం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న లే అవుట్లను అక్రమ ప్లాట్లుగా నిర్ధారిస్తూ, వాటిని క్రమబద్ధీకరించుకోవాలంటూ 2006లో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం, ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టింది. క్రమబద్ధీకరణ పేరిట నాటి ప్రభుత్వం మొదట ఎల్‌ఆర్‌ఎస్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దింతో గ్రామపంచాయతీ లే అవుట్ల రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతులతో స్థానిక సంస్థలకు కూడా ఆదాయం సమకూరింది. పల్లెలు, పట్టణాల్లో స్థలాల క్రమబద్ధీకరణకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకు ప్రత్యేక అధికార బృందాలను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని భావించింది. అక్రమ లేఅవుట్లలో ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు కేసీఆర్ ప్రభుత్వం ఆగస్టు 31, 2020న జీఓ నంబర్ 131ను జారీ చేసింది. జీఓకు ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. దింతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది.
ఎల్ఆర్ఎస్ అంశంపై నాడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా ఆరోపణలు చేసినా అంతిమంగా తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేసి, పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అనధికారిక లే అవుట్లు, జీపీ లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ఇబ్బంది పడుతున్న ఎంతోమందికి ఊరటనివ్వాల్సిన ప్రభుత్వం… జేబుకు చిల్లుపెట్టేందుకు సిద్ధమైనదని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని, పేదోడిపై ఒక్క రూపాయీ భారం మోపకుండానే ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇస్తూ అప్పటి టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి పలు సమావేశాల్లో ప్రకటించారని.. ఆయన సీఎం అయిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయాయని ఎద్దేవా చేస్తున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని, ఇప్పుడు 25 శాతం రాయితీ పేరిట పేదోడిపై లక్షల భారం మోపి 50 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్జించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. మార్చి 31లోపు దరఖాస్తు ఫీజులు చెల్లించాలని ప్రకటించడం వెనుక ఖజానా నింపుకోవాలనే ఉద్దేశమే తప్పా.. సామాన్యులకు లబ్ధి చేయాలని ఏమి లేదని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.
Also Read: Foldable iPhone: ఐఫోన్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ గురించి పూర్తి వివరాలివే
ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు 25లక్షల59వేల562 వచ్చాయి. కాగా గ్రామపంచాయతీల పరిధిలో 10,83,394, మున్సిపాలిటీల పరిధిలో 10,60,013, కార్పొరేషన్లలో 4,16,155, జీహెచ్ఎంసీలో 1,06,891, బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 46,894, బోడుప్పల్ కార్పొరేషన్ లో 17,915, బండ్లగూడజాగీర్ కార్పొరేషన్ లో 7,324, పీర్జాదిగూడ కార్పొరేషన్ లో 9,431, నిజాంపేట కార్పొరేషన్ లో 4,175, మీర్ పేట కార్పొరేషన్ 3,365 దరఖాస్తులు వచ్చాయి. బీఆర్‌ఎస్ హయాంలోనూ ఎల్‌ఆర్‌ఎస్ నోటిఫికేషన్ జారీ చేసినా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, చార్జీలపై పలు రియల్ ఎస్టేట్ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలతో… ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకోలేదు.
అక్రమ లేఅవుట్లలోని ఫ్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరి ఒక్కో దరఖాస్తు కాకుండా ఒక్కో ప్రాంతం ఆధారంగా అక్కడ ఉన్న లేఅవుట్లన్నింటినీ ఒకేసారి వేర్వేరు విభాగాల అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఫలితంగా తక్కువ వ్యవధిలో ఎక్కువ దరఖాస్తుల పరిష్కారానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. 2020 సెప్టెంబరు1 నుంచి అక్టోబరు 31 వరకు రెండు నెలల పాటు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు ఇవ్వగా 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్‌తోపాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఎప్పుడు పరిష్కరిస్తారని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్నా ఎల్ ఆర్ ఎస్ పై ఎలాంటి అడుగు ముందుకు పడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
2015లో హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ తీసుకొచ్చారు. హెచ్‌ఎండీఏ బయట పంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్ లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పరిష్కారానికి సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే కొన్నివేల దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో కొందరు మళ్లీ ఈసారి కూడా దరఖాస్తు చేశారు. అప్పట్లో ఒక్కో దరఖాస్తును విడిగా పరిశీలన జరపడంతో తీవ్ర జాప్యమైంది. వేర్వేరు శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలను దరఖాస్తుదారులనే సమర్పించమనేవారు. వీటి కోసం ఆయా కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చింది. ఒక్కో ప్రాంతం, అక్కడ వచ్చిన దరఖాస్తుల్లోని లేఅవుట్లన్నింటిని ఏకకాలంలో పరిశీలన చేపడతారు.
Also Read: Kidney Problems: కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే.
ఏ దరఖాస్తుదారుడైనా లేఅవుట్ కాపీ లేక సమర్పించకపోతే పక్కన పెట్టకుండా అదే లేవుట్‌లో సర్వే నంబరులో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఇతర దరఖాస్తుదారులు సమర్పించిన కాపీతో పరిశీలిస్తారు. లేఅవుట్‌లో నిర్ధారిత 10 శాతం ఖాళీ స్థలం ఉందా లేదా చూస్తారు. చెరువుల్లో ఉన్నాయా? అసైన్డ్ ల్యాండ్సా? ఇలా వీటి పరిశీలనకు సంబంధించి నీటిపారుదల, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, అటవీ ఇలా అన్ని విభాగాల అధికారులు ఒకేసారి వచ్చి లేఅవుట్లు అన్ని వారి రికార్డుల ఆధారంగా పరిశీలిస్తారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా క్రమబద్ధీకరణకు అవకాశం ఉన్న ఫ్లాట్లు అన్నింటిని ఏకకాలంలో పరిష్కరిస్తారు. మిగతావాటిని తిరస్కరించాలని గత ప్రభుత్వం నిర్ణయంగా ఉంది.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు దశల్లో ప్లాట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులను మొదటి దశలో భాగంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పాలక సంస్థల్లో గ్రామం, సర్వే నంబర్, కాలనీ, వార్డుల వారీగా క్లస్టర్లుగా విభజించే పనిని అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. రెండో దశలో క్లస్టర్లుగా విభజించిన దరఖాస్తులను క్షేత్రస్థాయికి వెళ్లి పారదర్శకంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రెవెన్యూ, జలవనరులు, పంచాయతీరాజ్, పట్టణ ప్రణాళిక, అధికారుల బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలి. ఎస్ఆర్ఎస్ నిబంధనలకు లోబడి ఉన్న వాటి వివరాలు ఉన్నతాధికారులకు నివేదించాల్సి ఉండగా ఇప్పటి వరకు రెండో దశ ప్రక్రియ పూర్తి కాలేదు.
గ్రామ పంచాయతీల్లో ఉన్న అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి ఎల్ఆర్ఎస్ కోసం లక్షల దరఖాస్తులు వచ్చాయి. మున్సి పాలిటీలు, కార్పొరేషన్, నగర పాలక సంస్థల పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి వదిలేశారు. పంచాయతీల్లోనూ వేల ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేశారు. క్రమబద్ధీకరణ కోసం ప్లాట్ల యజమానులు దరఖాస్తు చేసుకున్నా నేటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పంచాయతీల పరిధిలో అనుమతి లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తులు తీసుకొని ఎస్ఆర్ఎస్ ప్రక్రియ ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
Also Read: 200cc Bikes: తక్కువ ధరలోనే.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్‌లు ఇవే
ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో భారీ మొత్తంలో వసూలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏతోపాటు, నగర శివారులో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తంగా 7లక్షలకు పైగా ఉన్న పెండింగ్ దరఖాస్తులతో ఖజానా నింపుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 2020 నుంచి కార్యాలయాల్లో మగ్గుతున్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మార్చి 31 గడువులోగా ఫీజులు చెల్లించుకోవాలని, 25 శాతం రాయితీనిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన ఐదారేండ్లుగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండేందుకు ప్రధాన కారణాల్లో ఇరిగేషన్, రెవెన్యూతో పాటు అనుమతులిచ్చే మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. దీంతోనే ఇప్పటికీ లక్షలాది దరఖాస్తులను ఎప్పటిలోగా ఎలా పరిష్కరిస్తారో తెలియక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఆశాజనకంగా లేదు.
ప్రతీ రోజు అప్పు చేయాల్సిన పరిస్థితి. కేంద్రం నుంచి ఆయా పథకాల అమలుకు రావాల్సిన నిధులు కూడా సకాలంలో రావడం లేదని మంత్రులు వాపోతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రతిపక్షాల నిరసనలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దింతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాల సందర్భంగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్ విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 25 శాతం రాయితీ కల్పిస్తూ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు తీసుకోవడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం రానుందని అధికారులు స్పష్టం చేశారు.
ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మరికొన్ని ఆదాయం వచ్చే మార్గాలను ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్దమైందని తెలుస్తోంది. మరి ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం ఎలా సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.
