Revanth Reddy

Revanth Reddy: త్వరలోనే మరో 25,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Revanth Reddy: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు! రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 75 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 25 వేల సర్కారీ కొలువులను (వీటితో పాటు 2 వేల హోంగార్డు పోస్టులను) భర్తీ చేసి లక్ష ఉద్యోగాల హామీని పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు.

గురువారం (నవంబర్ 26, 2026) నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు అందించే ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

అచ్చంపేట గడ్డపైనే పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని, రక్తాన్ని చెమటగా మార్చి అచ్చంపేటను అన్ని విధాలా అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీరమాంబ, అచ్చమ్మ వంటి మహనీయుల పోరాట వారసత్వాన్ని ఈ నేల కొనసాగిస్తోందని కొనియాడారు.

అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గత బీఆర్‌ఎస్ పాలనపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో చేసిన తప్పులకు ప్రజలకు ముఖం చూపించలేకే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ.8.50 లక్షల కోట్ల అప్పులపాలు చేసి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో సూరత్ నుంచి కేజీల లెక్కన నాసిరకం బతుకమ్మ చీరలు తెచ్చి కమిషన్లు దండుకున్నారని, ఆ చీరలు మహిళలు కట్టుకోవడానికి కాకుండా పొలాల్లో చేల చుట్టూ కంచెగా కట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడ్డాయని సీఎం ఎద్దేవా చేశారు.

తమ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, ఈ మూడేళ్లలోనే రైతుల కోసం రూ.1.78 లక్షల కోట్లు వెచ్చించామని తెలిపారు. గత మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

అలాగే పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ పదేళ్ల పాటు పడావు పెట్టి, కృష్ణా జలాలను నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు రాసిచ్చారని సీఎం ఆరోపించారు. రోజా వడ్డించిన రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాలసీమ కావాలని నాడు కేసీఆర్ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే నేడు కృష్ణా జలాలు ఏపీకి తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *