Fishermen: సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ చిక్కకుండా పోయిన కాకినాడ జిల్లా మత్స్యకారుల కథ ఎట్టకేలకు సుఖాంతమైంది! నడిసంద్రంలో తుపాను కారణంగా తప్పిపోయారేమోనని ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందబాష్పాలు నింపుతూ ఏడుగురు మత్స్యకారులు అర్ధరాత్రి దాటాక సురక్షితంగా తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ పంచాయతీ శివారు సుబ్బంపేట గ్రామంలో ఇన్ని రోజులుగా నెలకొన్న విషాదఛాయలు వీడి పండుగ వాతావరణం నెలకొంది.
అసలేం జరిగిందంటే.. సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల (నవంబర్) 4వ తేదీన బోటుపై సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ తీరం వరకు వెళ్లేంత వరకు వారు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో టచ్‌లోనే ఉన్నారు. అయితే, ఈ నెల 19వ తేదీ నుంచి ఒక్కసారిగా వారితో సంబంధాలు తెగిపోయాయి.
సరిగ్గా అదే సమయంలో ‘అక్వాన్’ తుపాను తీరం దాటడంతో మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర భయాందోళన మొదలైంది. తమ వారు ఏమయ్యారోనని కన్నీరుమున్నీరవుతూ అధికారులను ఆశ్రయించగా, కోస్టు గార్డు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే, తాము క్షేమంగా తిరిగి రావడంపై మత్స్యకారులు అసలు విషయాన్ని వివరించారు. “సముద్రంలో వేటకు వెళ్లిన తర్వాత వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని మాకు తెలిసింది. ఆ ప్రతికూల వాతావరణంలో ప్రయాణించడం ప్రమాదకరమని భావించి బోటును అక్కడే ఆపేశాము. తెల్లవారుజామున బోటు బేరింగ్ పాడైంది దానిని బాగు చేసేసరికి రాత్రయింది. ఆ తర్వాత గేర్‌బాక్స్ కూడా మొరాయించడంతో దానిని మరమ్మతు చేసుకోవడానికే రెండు రోజులు పట్టింది.
అప్పటికే సముద్రం మధ్యలో ఫోన్లకు సిగ్నల్స్ లేకుండా పోయాయి, ఫోన్లలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సిగ్నల్స్ అందకపోవడం వల్లే మేము కుటుంబ సభ్యులకు ఫోన్ చేయలేకపోయాము” అని జాలర్లు తెలిపారు. తుపాను సమయంలో వర్షం వల్ల కాస్త ఇబ్బంది పడ్డామే తప్ప ఎలాంటి ప్రాణాపాయం ఎదురుకాలేదని వారు స్పష్టం చేశారు. కాగా, మత్స్యశాఖ అధికారులు, కోస్టు గార్డు సిబ్బంది ఉప్పాడ చేరుకుని మత్స్యకారులను పరామర్శించి, సముద్రంలో ఎదురైన పరిస్థితులపై వివరాలు సేకరించారు.
