Supreme Court: తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విశ్వరూపం ప్రదర్శించింది! తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంపై, ఆలయ నిర్వాహకులపై జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
శుక్రవారం (నవంబర్ 27, 2026) ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ పాలకమండలిని (ట్రస్టీలను) తక్షణమే రద్దు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, తమిళనాడు పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఆలయం మరియు కొండ ప్రాంత భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (CRPF) చేతికి అప్పగించింది. రేపే (శనివారం) వివాదాస్పద దీపథూన్ రాతి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అసలు ఈ వివాదం నేపథ్యమేంటంటే.. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 24న సాయంత్రం 6 గంటలకు తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపథూన్ (దీపస్తంభం) వద్ద ఒక్కసారి దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు నవంబర్ 20న అనుమతి ఇచ్చింది. అయితే, సంప్రదాయాలకు విరుద్ధమంటూ ఆలయ బోర్డు తీర్మానం చేయడంతో అధికారులు కేవలం సంప్రదాయంగా వెలిగించే ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించి, దీపథూన్ వద్ద దీపం వెలిగించలేదు.
దీనిపై బుధవారం తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెబుతూ, ఆలయ అధికారులనే బాధ్యులుగా పేర్కొంది. అయితే, ప్రభుత్వం మరియు ఆలయ నిర్వాహకుల తీరును సవాల్ చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లపై శుక్రవారం విచారణ ప్రారంభించిన ధర్మాసనం అత్యంత కఠినంగా స్పందించింది.
విచారణ సందర్భంగా మదురై జిల్లా కలెక్టర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. “మీరు జిల్లా మేజిస్ట్రేట్.. కోర్టు ఆదేశాల మేరకు దీపం వెలిగేలా చూడటం మీ డ్యూటీ. ఆ పని మీరు చేసి ఉండాల్సింది, ఎందుకు చేయలేదు? సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించే అధికారం ఎవరికీ లేదు” అని కలెక్టర్ తరఫు న్యాయవాది గోపా శంకరనారాయణన్‌ను ధర్మాసనం నిలదీసింది.
తమిళనాడులో పరిపాలన గందరగోళంగా ఉందని, ముఖ్యంగా మదురై జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని జస్టిస్ అరవింద్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 ప్రకారం కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం తమకు ఉందని స్పష్టం చేస్తూ.. “కోర్టు ఆదేశాలను ఎవరూ నీరుగార్చలేరు. ఇలాంటి చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన సమయం వచ్చింది, లేకపోతే దేశంలో రాజ్యాంగపరమైన గందరగోళం ఏర్పడుతుంది” అని ఘాటుగా హెచ్చరించారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలు ఇలా ఉన్నాయి.
15 మందికి కోర్టు ధిక్కార నోటీసులు: కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ (DGP), హెచ్ఆర్ అండ్ సీఈ (HR&CE) సెక్రటరీ, కమిషనర్, మదురై జిల్లా కలెక్టర్, సీపీ, ఎస్పీ మరియు నలుగురు ఆలయ ట్రస్టీలు సహా మొత్తం 15 మందికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. మూడు రోజుల్లోగా అందరికీ నోటీసులు అందజేసి, వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది
పాలకమండలి రద్దు – రిటైర్డ్ జడ్జీల నియామకం: ఆలయ ట్రస్టీల వైఖరిని తీవ్రమైన ఉల్లంఘనగా అభివర్ణిస్తూ పాలకమండలిని రద్దు చేసింది. ఆలయ వ్యవహారాల నిర్వహణకు రిసీవర్లుగా రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్థిబన్‌లను నియమించింది.
సీఆర్పీఎఫ్ పహారాలో కొండ: రాష్ట్ర పోలీసులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమయ్యారని పేర్కొంటూ ఆలయం, కొండ ప్రాంత భద్రతను సీఆర్పీఎఫ్కు అప్పగించింది. కొండపై ఉన్న ఆలయం మరియు దర్గా రెండింటిలోనూ కార్యకలాపాలు ప్రశాంతంగా సాగేలా చూడాలని, భక్తులు తమ మతపరమైన ఆచారాలు నిర్వహించుకునేందుకు తగిన రక్షణ కల్పించాలని సీఆర్పీఎఫ్ను ఆదేశించింది.
