Tamil Nadu: తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం తీవ్ర రాజకీయ, న్యాయ వివాదానికి దారితీసింది. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 24న కొండపై ఉన్న వివాదాస్పద రాతి స్తంభం ‘దీపత్తూన్’ (Deepathoon) వద్ద దీపం వెలిగించాల్సి ఉండగా, ఆ కార్యక్రమం జరగలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోయినందుకు తమిళనాడు ప్రభుత్వం తరఫున మదురై జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ బుధవారం (నవంబర్ 25, 2026) జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్టేటస్ రిపోర్టు సమర్పిస్తూ బేషరతుగా క్షమాపణలు కోరారు.
అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ తన అఫిడవిట్లో వివరంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, దాదాపు 5,797 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఆలయ యాజమాన్యం ఎంపిక చేసి ఆమోదించిన బృందం ద్వారానే దీపం వెలిగించాల్సి ఉంది.
