Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) విజయవాడ పర్యటన నేపథ్యంలో నగర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వీవీఐపీ (VVIP) భద్రత, శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నగరంలోని కీలక ప్రాంతాల్లో ‘నో ఫ్లైయింగ్ జోన్’ (No-Flying Zone) అమలు చేస్తున్నట్లు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ రాజ శేఖర బాబు అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
ఏయే ప్రాంతాల్లో ఆంక్షలు? వేటిపై నిషేధం?
పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం నేడు కేంద్ర మంత్రి పర్యటన ముగిసే వరకు ఈ కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి. విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కళా వేదిక మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు పూర్తిగా ‘నో ఫ్లైయింగ్ జోన్’ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఆ ప్రాంతాల్లో ఎలాంటి డ్రోన్లు (Drones), రిమోట్ కంట్రోల్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు లేదా ఇతర ఎగిరే పరికరాలను ఎగురవేయడం పూర్తిగా నిషేధించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 223 కింద కేసులు!
పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్లు లేదా ఇతర పరికరాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223 తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ (Aircraft Act) నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.అనుమతి లేకుండా ఎగురవేసిన డ్రోన్లు, ఇతర పరికరాలను పోలీసులు తక్షణమే స్వాధీనం చేసుకుంటారు.అత్యంత కీలకమైన కేంద్ర మంత్రి పర్యటన దృష్ట్యా విజయవాడ నగర ప్రజలందరూ భద్రతా కారణాలను అర్థం చేసుకుని పోలీసులకు పూర్తిగా సహకరించాలని సీపీ రాజ శేఖర బాబు విజ్ఞప్తి చేశారు.
