Ponnam Prabhakar

Ponnam Prabhakar: రాహుల్ గాంధీపై మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు..

Ponnam Prabhakar: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది! ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన మంత్రి పొన్నం.. గత బీఆర్ఎస్ పాలనలోని వివాదాలు, అవినీతి ఆరోపణలను ఏకరవు పెడుతూ కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. “అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. మీ అవినీతి లెక్కలు చెప్పడానికి ఏకంగా ఏడాది సమయం పడుతుంది” అంటూ పొన్నం చేసిన పోస్ట్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రాహుల్ గాంధీపై విమర్శలు – పొన్నం ఘాటు సమాధానం..

రాహుల్ గాంధీని విమర్శించేంత ఇమేజ్, స్థాయి కేటీఆర్‌కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.”దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీది. అలాంటి నాయకుడి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు” అని ఆయన స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం హామీలు ఇవ్వడమే కాదు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే సత్తా కూడా ఉందని తెలిపారు. మీలాగా వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాలనే ఆసక్తి గానీ, అవసరం గానీ తమకు లేదని, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పొన్నం పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ పాలనలోని ఘటనలను గుర్తుచేస్తూ ప్రశ్నల వర్షం..

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్‌కు సూటి ప్రశ్నలు సంధించారు
  • నేరెళ్ల, ఖమ్మం, మల్లన్నసాగర్ ఘటనలు: “నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి మీ హయాంలో జరగలేదా? ఖమ్మంలో మిర్చి రైతులకు చేతులకు బేడీలు వేసింది మీ ప్రభుత్వమే కాదా? మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేయించింది మీ పాలనలో కాదా?” అని ప్రశ్నించారు.
  • గ్రూప్-1 నోటిఫికేషన్: “పదేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగుల కోసం కనీసం ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా సరిగ్గా ఇచ్చారా? మేము అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా, పరీక్షలు కూడా విజయవంతంగా నిర్వహించి చూపించాం” అని పొన్నం కౌంటర్ ఇచ్చారు.

ఫార్ములా-ఈ రేస్, కాళేశ్వరం అవినీతి ఆరోపణల ప్రస్తావన..

కేటీఆర్ అవినీతి గురించి మాట్లాడటంపై స్పందిస్తూ.. స్వయంగా కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్ (Formula-E Race) కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పొన్నం గుర్తుచేశారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, అసైన్డ్ భూముల వ్యవహారాలను ప్రస్తావిస్తూ.. “ఇలా చెప్పుకుంటూ పోతే మీ హయాంలో జరిగిన అవినీతి లెక్కలు చెప్పడానికి ఏడాది పడుతుంది. మీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్భాటాలకు, మా ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న ఏర్పాట్లకు పోలిక పెడితే అబద్ధం కూడా సిగ్గుపడుతుంది” అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ట్వీట్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *