Guwahati Train

Guwahati Train: రైలు భోజనంలో ఇనుప తీగ ముక్క..ఐఆర్‌సీటీసీ సీరియస్.. కాంట్రాక్టర్‌పై భారీ పెనాల్టీ!

Guwahati Train: ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఆకలి వేసి వేడివేడిగా పప్పు, అన్నం ఆర్డర్ చేసుకుని తింటుంటే.. సగం ప్లేట్ ఖాళీ అయ్యాక పప్పులో ఇనుప స్క్రబ్బర్ తీగ ముక్క తగిలితే ఎలా ఉంటుంది? ఒళ్లు జలదరించి గుండె గుభేలుమనడం ఖాయం. గువాహటి నుంచి ఓఖా వెళ్లే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌లో సరిగ్గా ఇలాంటి భయానకమైన సీనే ఎదురైంది ఓ ప్రయాణికుడికి. ఆ మెటల్ పీస్ గొంతులోకి వెళ్లి ఉంటే ప్రాణాలకే ముప్పు వచ్చేదని సదరు ప్యాసింజర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. దీనిపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తక్షణమే స్పందించి సదరు క్యాటరింగ్ కాంట్రాక్టర్‌పై భారీ జరిమానా విధించింది.

ఇప్పటికే సగం తినేశా.. ఇంకేమైనా మింగేశానో ఏమో!

అమిత్ అవస్థి అనే ప్రయాణికుడు గౌహతి–ఓఖా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ట్రైన్ ప్యాంట్రీ నుంచి తెప్పించుకున్న పప్పును తింటుండగా, ఆయనకు వెండి రంగులో ఉన్న పదునైన ఇనుప తీగ ముక్క కనిపించింది. చూడండి.. నా పప్పులో ఏం దొరికిందో! అప్పటికే నేను సగం భోజనం పూర్తి చేశాను. ఇలాంటి ముక్కలు ఇంకేమైనా కడుపులోకి పోయాయేమోనని భయమేస్తోంది. ఇది గిన్నెలు తోమే స్టీల్ స్క్రబ్బర్ అని స్టాఫ్ చెప్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో చూడండి. ఐఆర్‌సీటీసీ వెంటనే ఇలాంటి చెత్త నాణ్యతపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆ ముక్కను చూపిస్తూ వీడియో తీసి ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

గిన్నెలు తోమే పీచు సర్.. పొరపాటున పడింది.. క్షమాపణలు చెప్పిన స్టాఫ్..

ఈ వీడియో నెట్టింట వైరల్ అయిన కొద్దిసేపటికే ప్యాంట్రీ సిబ్బంది వచ్చి సంజాయిషీ ఇచ్చుకున్న మరో వీడియో కూడా బయటకు వచ్చింది.. హోటళ్లు, క్యాటరింగ్‌లలో వాడే స్టెయిన్‌లెస్ స్టీల్ మెష్ స్క్రబ్బర్ ముక్క పాత్రలు తోముతున్నప్పుడు అందులో ఇరుక్కుపోయి ఉంటుందని, పొరపాటున పప్పులోకి వచ్చిందని క్యాటరింగ్ వర్కర్ ఒప్పుకున్నాడు.

ప్రయాణికుడికి పదే పదే క్షమాపణలు చెబుతూ.. కావాలంటే వేరే భోజనం ఇస్తామని, లేదంటే తిన్న భోజనం డబ్బులు మొత్తం రీఫండ్ చేస్తామని ప్రాధేయపడ్డాడు. అయితే, ప్రయాణికుల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహించిన అమిత్.. రీఫండ్ గానీ, కొత్త భోజనం గానీ తీసుకోబోనని, రైల్వే ఉన్నతాధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తానని తెగేసి చెప్పారు.

ఐఆర్‌సీటీసీ సీరియస్ యాక్షన్ – సిబ్బంది డ్యూటీ రద్దు..

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ లేపడంతో IRCTC అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్ ద్వారా తక్షణమే స్పందించింది.ఈ విషయాన్ని అత్యంత తీవ్రమైన తప్పిదంగా పరిగణించినట్లు రైల్వే శాఖ తెలిపింది. సంబంధిత క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ (కాంట్రాక్టర్) పై భారీ పెనాల్టీ (Substantial Penalty) విధించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన సంబంధిత క్యాటరింగ్ సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించి (De-rostered) కఠిన చర్యలు చేపట్టినట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *