Tragedy

Tragedy: బాణసంచా కాలుస్తుండగా దూసుకొచ్చిన రాకెట్.. 10 ఏళ్ల బాలుడు దుర్మరణం!

Tragedy: దీపావళి పండుగ వేళ దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న క్రమంలో జరిగిన ఘోర ప్రమాదంలో 10 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని నరేలా ప్రాంత పరిధిలోని రాజీవ్ కాలనీలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి దీపావళి పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇంటి వద్ద పిల్లలతో కలిసి టపాసులు కాలుస్తున్నారు. ఆ సమయంలో వెలిగించిన ఒక రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లకుండా, అనూహ్యంగా దిశ మార్చుకుని అక్కడే నిలబడి ఉన్న 10 ఏళ్ల బాలుడి వైపు దూసుకొచ్చింది. ఆ మండుతున్న రాకెట్ నేరుగా బాలుడి పొట్ట భాగానికి బలంగా తాకడంతో పాటు అక్కడే పేలిపోవడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి కాలిపోయాడు.

రక్తపు మడుగులో కుప్పకూలిన బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. అనంతరం ఆసుపత్రి వైద్యులు సకాలంలో స్పందించలేదని, చికిత్సలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ బాలుడి బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఆందోళనకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి దారితీసిన బాణసంచా రకం, సాంకేతిక లోపంపై దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *