Itlu Arjuna

Itlu Arjuna: ఎవరీ అనీష్ రెడ్డి? టాలీవుడ్ మొత్తం ఎందుకు సపోర్ట్ చేస్తుంది..?

Itlu Arjuna: సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో ఫ్యామిలి నుంచి వచ్చే హీరోలకో లేదా తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్స్ కొట్టిన వారికో ఇండస్ట్రీలో భారీ హైప్ రావడం సహజం. అయితే, ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ఒక సరికొత్త ముఖం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ నటుడే అనీష్ రెడ్డి (అనీష్). ఆయన హీరోగా పరిచయమవుతున్న తాజా సినిమా  ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). ఈ సినిమాకు పరిశ్రమలోని అగ్ర హీరోలు, ప్రముఖ దర్శకులు అందిస్తున్న మద్దతు చూసి అసలు ఎవరీ అనీష్? ఆయన వెనుక ఉన్న బలమేంటి? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.

స్టార్ హీరోల అండ.. భారీ బడ్జెట్ అరంగేట్రం..

ఓ డెబ్యూ హీరో సినిమాకు సాధారణంగా కనిపించని స్థాయిలో ‘ఇట్లు అర్జున’కు సినిమా ఇండస్ట్రీ లో ని పెద్దల నుండి సహకారం లభించింది.

  • కింగ్ నాగార్జున సమర్పణ: ఈ సినిమాకి స్వయంగా అక్కినేని నాగార్జున సమర్పిస్తుండటం సినిమాపై ఉన్న నమ్మకాన్ని పెంచింది.

  • ట్రైలర్ లాంచ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌ను విడుదల చేసి, అనీష్ నటనను, ఆయన ఎంచుకున్న పాత్రను ప్రత్యేకంగా అభినందించారు.

  • వెంకీ కుడుముల ప్రొడక్షన్: ‘ఛలో’, ‘భీష్మ’ వంటి విజయవంతమైన సినిమాల దర్శకుడు వెంకీ కుడుముల ఈ ప్రాజెక్ట్‌పై దాదాపు ఏడాదిన్నర పాటు ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా, ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై నిర్మాతగా వ్యవహరించారు.

  • స్టార్ టెక్నీషియన్లు: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూర్చగా, మహేష్ ఉప్పల ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దాదాపు ₹40 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అనీష్ నేపథ్యం ఏంటి? ఇండస్ట్రీ సపోర్ట్ వెనుక అసలు లింక్!

అనీష్ హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ రంగ దిగ్గజం ‘ఏఎమ్ఆర్ గ్రూప్’ (AMR Group) అధినేత మహేష్ రెడ్డి చిన్న కుమారుడు. వ్యాపారవేత్త అయిన మహేష్ రెడ్డికి టాలీవుడ్ ప్రముఖులతో, ముఖ్యంగా అక్కినేని నాగార్జునతో దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

గతంలో నాగార్జున నటించిన భక్తిరస చిత్రాలు ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలను మహేష్ రెడ్డే నిర్మించారు.ఆ అనుబంధంతో పాటు, సినిమా కాన్సెప్ట్ మరియు అనీష్ నటన నచ్చడంతో నాగార్జున ఈ సినిమాకు సమర్పకుడిగా నిలిచారు. నందమూరి కుటుంబంతోనూ ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఎన్టీఆర్ సైతం ట్రైలర్ లాంచ్‌కు ముందుకు వచ్చారు.

తొలి చిత్రంలోనే మూగవాడి పాత్ర.. కథలో సస్పెన్స్..

తొలి సినిమాకే రెగ్యులర్ కమర్షియల్ మాస్ హంగామా కాకుండా, ఒక చాలెంజింగ్ రోల్‌ను అనీష్ ఎంచుకున్నారు. ఈ చిత్రంలో ఆయన మాటలు రాని (మూగవాడైన) అర్జున్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే నటించడం విశేషం.

మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించగా, వీరిద్దరి మధ్య నడిచే మూగ ప్రేమకథకు ఓ క్రైమ్ ఎపిసోడ్, ₹1000 కోట్ల పెన్‌డ్రైవ్ మిస్టరీ తోడై కథలో ఉత్కంఠను రేపుతోంది.పరిశ్రమలోని బడా స్టార్ల మద్దతు, భారీ ప్రచారం సినిమాకు ముందస్తు బజ్‌ను తెచ్చిపెట్టినప్పటికీ.. నటుడిగా అనీష్ తెలుగు ప్రేక్షకుల మనసులను ఏ మేరకు గెలుచుకుంటారనేది ఆయన నటన, సినిమా కంటెంట్‌పైనే ఆధారపడి ఉంది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న ‘ఇట్లు అర్జున’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *