Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: రాప్తాడు దాడి ఘటన.. ‘యానిమల్’ సినిమాపై విమర్శలకు సందీప్ రెడ్డి వంగా ఘాటు రిప్లై

Sandeep Reddy Vanga: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన హేయమైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే, ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో సినిమాల్లో చూపించే హింసపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను లక్ష్యంగా చేసుకుంటూ కొందరు నెటిజన్లు, సినీ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ‘యానిమల్’ సినిమాలో హీరో తరగతి గదిలోకి ఆయుధంతో చొరబడే సీన్‌ను ప్రస్తావిస్తూ.. ఇలాంటి చిత్రాలే నేరస్థులకు ప్రేరణగా మారుతున్నాయంటూ ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సినిమాలను బలిపశువులను చేయకండి.. సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం

ఓ దుర్ఘటన జరిగినప్పుడు మూల కారణాలను, నేరస్థుడి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి బదులుగా.. వినోద సాధనమైన సినిమాపై నిందలు వేయడం కొందరికి అలవాటుగా మారిందని సందీప్ మండిపడ్డారు.
సందీప్ రెడ్డి వంగా ట్వీట్ పూర్తి సారాంశం:
ఎవరైనా అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడినప్పుడు.. మన మొదటి ప్రతిస్పందన బాధితుల పట్ల సానుభూతి చూపడం, సమస్యకు గల విస్తృత కోణాలను అర్థం చేసుకోవడమే కావాలి. అంతేకానీ, సినిమాను చాలా సులువుగా ఒక బలిపశువుగా మార్చడం కాదు. మీ ఆందోళన బాధితులు లేదా వారి కుటుంబాల పట్ల కాదని, ఒక భయానక విషాదాన్ని వాడుకుని మీ వ్యక్తిగత కక్షలను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
ముఖ్యంగా అవకాశాలు లేక నిరాశలో ఉన్న కొందరు ఫెయిల్డ్ నటీనటులు, కొంతమంది దర్శకులు, నిర్మాతలు, పరాన్నజీవులుగా మారిన కొందరిని ఉద్దేశించి నేను ఇది చెబుతున్నా. ఇతరుల పనిని విమర్శించే అవకాశం రాగానే మీరంతా హఠాత్తుగా సామాజిక సంస్కర్తలుగా మారిపోతుంటారు. ఒక విషాదానికి కావాల్సింది సానుభూతి.. అవకాశవాదం కాదు. ఆ రెండింటి మధ్య తేడాను తెలుసుకోండి.”

వివాదానికి కారణమైన ‘యానిమల్’ సీన్ విమర్శలు

రాప్తాడు పాఠశాలలోకి నిందితుడు హేమంత్ ప్రవేశించి తరగతి గదిలోనే విద్యార్థినిపై దాడి చేసిన తీరు.. ‘యానిమల్’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ గన్‌తో కాలేజీ క్లాస్‌రూమ్‌లోకి చొరబడే సన్నివేశాన్ని పోలి ఉందంటూ నెటిజన్లతో పాటు కొందరు సినీ, రాజకీయ విశ్లేషకులు పోస్టులు పెట్టారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సైతం గతంలో ఇలాంటి అతిక్రూరమైన పాత్రలు, హింసను గ్లోరిఫై చేయడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్న విషయాలను ప్రస్తావించారు. అర్జున్ రెడ్డి, యానిమల్, ధురంధర్ వంటి చిత్రాలు యువతను తీవ్ర హింస వైపు పురిగొల్పుతున్నాయంటూ సాగిన ప్రచారానికి సందీప్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

సినిమా అనేది కేవలం మాధ్యమం మాత్రమే: విశ్లేషకుల మాట

ఒక కథలో చూపించే పాత్రలు, సంఘర్షణలు సినిమాటిక్ అనుభూతి కోసమే తప్ప సమాజాన్ని హింస వైపు నడిపించే ఉద్దేశంతో ఏ దర్శకుడూ తీయరని సినీ ప్రియులు సందీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. సినిమాలలో హింస ఉన్నప్పటికీ, అంతిమంగా ధర్మం, న్యాయం, మంచే గెలుస్తాయనే సందేశం కూడా ఉంటుందని గుర్తుచేస్తున్నారు. సినిమాలోని ఏ అంశాన్ని ఎలా స్వీకరించాలనేది చూసే ప్రేక్షకుల విచక్షణ, మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.
గతంలో ఇదే అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మాట్లాడుతూ.. “రామాయణం ఉండటం వల్లే సమాజంలో కిడ్నాప్‌లు జరుగుతున్నాయని నిందించడం ఎంత మూర్ఖత్వమో.. సినిమాల వల్లే నేరాలు జరుగుతున్నాయని అనడం కూడా అంతే హాస్యాస్పదం” అని వ్యాఖ్యానించిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
దారుణ నేరాలకు పాల్పడే వ్యక్తుల నేర ప్రవృత్తి, సామాజిక-మానసిక పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని, విషాదాలను తమ వ్యక్తిగత ఎజెండాలు, విమర్శలకు వేదికగా మార్చుకోకూడదని సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *