YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) ఉల్లంఘించడంతో పాటు, రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. వైఎస్ జగన్‌తో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు కీలక వైఎస్సార్సీపీ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద ఏం జరిగింది?
ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
-
ఏజెంట్లను అడ్డుకున్నారని ఆరోపణ: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ బూత్‌లలోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను వెళ్లకుండా అధికారులు, ప్రత్యర్థి వర్గీయులు అడ్డుకున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయింపు: తమ ఏజెంట్లు లేకుండానే ఏకపక్షంగా పోలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ జగన్ స్వయంగా రంగంలోకి దిగి, నేతలు, కార్యకర్తలు, ఏజెంట్లతో కలిసి పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.
-
పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏపీలో బిహార్ పరిస్థితులు.. ఎక్కడ చూసినా టీడీపీ గూండాలే.. జగన్ ఆగ్రహం
ధర్నా సందర్భంగా అధికారుల తీరుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ జరగాలి. కానీ పులివెందులలో ఎక్కడ చూసినా అధికార టీడీపీ గూండాలే రాజ్యమేలుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు అని అధికారులను నిలదీశారు.
ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే.. రాష్ట్రంలో పరిస్థితులు బిహార్‌ను తలపిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ పార్టీ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వకుండా అడ్డుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు నమోదు
పోలింగ్ కేంద్రం, రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద నిరసన తెలపడం, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించడం, శాంతిభద్రతల సమస్యను సృష్టించడంపై ఎన్నికల అధికారులు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలపై ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
