Chain Snatching

Chain Snatching: బెంగళూరులో ఫెవిక్విక్ తో వెరైటీ గా దొంగతనం చేయాలనుకున్నాడు.. ప్లాన్ రివర్స్.. స్థానికులు ఏం చేశారంటే?

Chain Snatching: కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ఇందిరానగర్ ప్రాంతంలో సినిమా తరహాలో వింతైన, భయానక దోపిడీ యత్నం వెలుగుచూసింది. ఓ దుకాణంలో పనిచేస్తున్న మహిళను కత్తితో బెదిరించిన దుండగుడు.. ఆమె ప్రతిఘటించకుండా, అక్కడి నుంచి పారిపోకుండా ఉండేందుకు ఆమె రెండు చేతులకు ‘ఫెవిక్విక్’ గ్లూ వేసి అక్కడున్న బల్లకు అతికించేశాడు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ధైర్యసాహసాలు ప్రదర్శించి నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు.

నన్ను చంపేస్తున్నారు కాపాడండి.. అంటూ డ్రామా!

ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం సుమారు 11:45 గంటల సమయంలో డెలివరీ బాయ్‌గా పనిచేసే ప్రభురాజ్ అలియాస్ రాజ్ అనే వ్యక్తి ఓ షాపులోకి హడావుడిగా ప్రవేశించాడు. తనను ఎవరో చంపేందుకు వెంటాడుతున్నారని, ప్రాణాలు కాపాడి దాక్కోవడానికి ఆశ్రయం ఇవ్వాలంటూ సదరు మహిళను ప్రాధేయపడినట్లు నటించాడు. మహిళ పరిస్థితిని అర్థం చేసుకునే లోపే, అతడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తన జేబులోంచి కత్తి తీసి నేరుగా ఆమె గొంతుపై పెట్టి చంపేస్తానని బెదిరించాడు.

చేతులకు ఫెవిక్విక్ రాసి బల్లకి అతికించి.. చైన్ స్నాచింగ్ యత్నం!

మహిళ మెడలో ఉన్న దాదాపు 35 గ్రాముల బరువున్న (విలువ సుమారు రూ.4.5 లక్షలు) బంగారు గొలుసును ఇవ్వాలని దుండగుడు డిమాండ్ చేశాడు. ఆమె అరవకుండా లేదా బయటకు పరుగులు తీయకుండా ఉండేందుకు దుండగుడు వింత ఆలోచన చేశాడు. వెంట తెచ్చుకున్న ‘ఫెవిక్విక్’ గ్లూను మహిళ రెండు చేతులకు పూసి షాపులోని టేబుల్‌కు గట్టిగా అతికించేశాడు. చేతులు బల్లకి అతుక్కుపోవడంతో ఆమె కదలలేని పరిస్థితిని చూసి, మెడలోని బంగారు గొలుసును తెంపేందుకు ప్రయత్నించాడు.

అప్రమత్తమైన స్థానికులు.. సినిమా ఫక్కీలో రెస్క్యూ!

ప్రాణభయంతో సదరు మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఇతర దుకాణదారులు, పాదచారులు క్షణాల్లో షాపు వద్దకు చేరుకున్నారు. నలువైపులా జనం చుట్టుముట్టారని గ్రహించిన నిందితుడు ప్రభురాజ్, మహిళ మెడపై కత్తి ఉంచి ఎవరైనా ముందుకు వస్తే చంపేస్తానంటూ హల్చల్ చేశాడు. ఆమెను రక్షణ కవచంలా అడ్డుపెట్టుకుని తప్పించుకునేందుకు చూశాడు.

అయితే స్థానికులు అత్యంత చాకచక్యంగా అతడి దృష్టిని మళ్లించి, ఒక్కసారిగా దాడి చేసి నిందితుడిని కిందపడేసి బంధించారు.

సమాచారం అందుకున్న ఇందిరానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ప్రభురాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిందితుడి గత నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *