Amit Shah

Amit Shah: తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలా.. వద్దా..!

Amit Shah: తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి, అరాచక పాలనను అంతం చేయాలంటే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా బీజేపీ చేపట్టిన ‘మహా పాదయాత్ర’ లో పాల్గొన్న పాదయాత్ర ముగిసిన తర్వాత  మొజాంజాహి (ఎంజే) మార్కెట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై నిప్పులు చెరిగారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలను ఆయన తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు.

చార్మినార్ వద్ద పూజలు.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర!

సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ అగ్రనేతలు భారీ పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భాగంగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో కలిసి అబిడ్స్ మీదుగా ఎంజే మార్కెట్ వరకు వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాదయాత్ర సాగింది. సభలో జై శ్రీరాం నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించిన అమిత్ షా.. నిజాం మెడలు వంచి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారని, అలాంటి హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
రాహుల్ గాంధీకి కడుపునొప్పి ఎందుకు?: ఓట్ల వివాదంపై క్లారిటీ
ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను అమిత్ షా ఎండగట్టారు.
చనిపోయిన వారి ఓట్లు తొలగించాలా? వద్దా?.. దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ రాహుల్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన 3 కోట్ల మంది ఓట్లను, రెండు చోట్ల పేర్లు ఉన్నవారి ఓట్లను తొలగించాలా? వద్దా? అని ఆయన ప్రశ్నించారు.
చొరబాటుదారుల ఓట్లు రద్దు చేయాల్సిందే.. బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన 3 కోట్ల మంది ఓట్లను తొలగించవద్దని రాహుల్ వాదిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ, అక్రమ ఓట్లను ఏరివేస్తుంటే కాంగ్రెస్‌కు కడుపునొప్పి మొదలైందని ఎద్దేవా చేశారు. ఎస్‌ఐఆర్ (SIR) ద్వారా అక్రమ వలసదారుల ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తుంటే, కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు దాన్ని అడ్డుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు.
మాక్ పార్లమెంట్‌లోనే రాహుల్ ప్రధాని.. బీజేపీ విజయాల ప్రస్తావన
ఎస్‌ఐఆర్‌కు ముందే వరుస విజయాలు.. ఎస్‌ఐఆర్ కారణంగానే తాము గెలుస్తున్నామన్న కాంగ్రెస్ వాదనను అమిత్ షా కొట్టిపారేశారు. 2014, 2019 సాధారణ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడుసార్లు బీజేపీ గెలిచినప్పుడు ఎస్‌ఐఆర్ ఉందా అని ప్రశ్నించారు.
ఎప్పటికీ ప్రధాని కాలేరు: కాలేజీలు, స్కూళ్లలో నిర్వహించే మాక్ పార్లమెంట్‌లలో మాత్రమే రాహుల్ గాంధీ ప్రధాని కాగలరు.. అసలైన దేశ పార్లమెంట్‌లో ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో నిజమైన అంశాలపై చర్చ జరగాలంటే కాంగ్రెస్ భయపడుతోందని, సభలో చర్చిస్తే వారి బండారం మొత్తం బయటపడుతుందని అన్నారు.
తెలంగాణలో ‘ఆర్ ట్యాక్స్’ వసూలు చేస్తున్నారు..
తెలంగాణ కాంగ్రెస్ పాలనపై అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ‘వెంటిలేటర్‌’పై ఉందని పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారని, ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పీడిస్తూ ‘ఆర్ ట్యాక్స్’ వసూలు చేస్తోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, ప్రజలంతా బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని అమిత్ షా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *