nara lokesh

Nara Lokesh: స్నేహితురాలి కోసం రంపానికి ఎదురొడ్డిన చిన్నారి లక్ష్మి.. ‘ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం’ అంటూ మంత్రి లోకేష్ ప్రశంసలు!

Nara Lokesh: సాధారణంగా కళ్లెదుట ప్రాణాంతక దాడి జరుగుతుంటే ఎవరైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతారు. కానీ, తన ప్రాణాలకు తెగించి తోటి స్నేహితురాలిని కాపాడేందుకు ముందుకొచ్చి అసాధారణ సాహసాన్ని ప్రదర్శించింది చిన్నారి లక్ష్మి. అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్మాది ఎలక్ట్రిక్ రంపంతో తరగతి గదిలోకి చొరబడి చేసిన దాడిలో, బాధితురాలికి రక్షణ కవచంలా నిలిచి తాను కూడా తీవ్రంగా గాయపడిన లక్ష్మి తెగువ యావత్ రాష్ట్రాన్ని కదిలిస్తోంది. ఈ చిన్నారి చూపిన అపురూపమైన ధైర్యం, నిజమైన స్నేహాన్ని కొనియాడుతూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు.

పారిపోలేదు.. స్నేహితురాలికి రక్షణగా నిలిచింది!

పాఠశాలలో జరిగిన దారుణ ఘటనపై మంత్రి నారా లోకేష్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపం (Chainsaw) పట్టుకుని తరగతి గదిలోకి చొరబడినప్పుడు లక్ష్మి భయపడి పారిపోలేదు. తన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రాణాపాయంలో ఉన్న స్నేహితురాలిని కాపాడేందుకు ముందుకు అడుగేసి రక్షణగా నిలిచింది” అని లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో దుండగుడు ప్రయోగించిన రంపం బారిన పడి లక్ష్మి కూడా తీవ్రంగా గాయపడింది. ఇంత చిన్న వయసులోనే ఆమె చూపిన నిస్వార్థ ప్రేమ, ధైర్యసాహసాలు నిజమైన స్నేహానికి అసలైన అర్థాన్ని నేర్పుతున్నాయని మంత్రి కొనియాడారు.
ఇద్దరు బాలికల వైద్య ఖర్చులు ప్రభుత్వానివే: భరోసా ఇచ్చిన మంత్రి
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై లోకేష్ స్పందించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య పోరాడుతున్న విద్యార్థినితో పాటు, ధైర్యసాహసాలు చూపిన లక్ష్మి కూడా త్వరగా కోలుకోవాలని రాష్ట్ర ప్రజలంతా ప్రార్థిస్తున్నారని తెలిపారు.
ఇద్దరు బాలికలకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. చిన్నారులు త్వరలోనే పూర్తిగా కోలుకుని, మునుపటిలా ఆరోగ్యంతో, చిరునవ్వులతో మళ్లీ బడిబాట పట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై రాజీ లేదు
రాప్తాడు పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో భద్రత ప్రాధాన్యతను మరోసారి తెరపైకి తెచ్చింది.పాఠశాలలకు చదువుకోవడానికి వచ్చే ఏ ఒక్క విద్యార్థి కూడా తరగతి గదిలో అభద్రతా భావానికి గురికాకూడదని ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని లోకేష్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్ఠం చేస్తామని, విద్యార్థులు నిశ్చింతగా చదువుకునేలా సురక్షిత వాతావరణాన్ని కల్పించడానికి తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *