AP High Court

AP High Court: రాప్తాడు ఉన్మాది హేమంత్‌పై పోలీసుల కాల్పుల వ్యవహారం.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు..

AP High Court: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై పవర్ చైన్‌సాతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌పై పోలీసులు జరిపిన కాల్పుల ఘటన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. హేమంత్‌పై జరిగిన పోలీసు కాల్పుల వ్యవహారంపై నిష్పక్షపాతంగా, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం.. దీనిపై రేపు (మంగళవారం) సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
పిటిషనర్ తన పిల్‌లో పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కాల్పులు జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ రికార్డులు, అందుబాటులో ఉన్న వీడియో ఫుటేజ్‌లు మరియు నిందితుడి వైద్య నివేదికలు (మెడికల్ రిపోర్టులు) ఏవీ తారుమారు కాకుండా తక్షణమే భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే ఘటనా స్థలంలో లభించే ఫోరెన్సిక్ ఆధారాలను నిపుణుల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
నిందితుడు హేమంత్ వాంగ్మూలాన్ని నేరుగా మేజిస్ట్రేట్ సమక్షంలోనే వీడియో రికార్డింగ్‌తో నమోదు చేయించాలని, ఆ వాంగ్మూలంతో పాటు వీడియో రికార్డులను ఎవరికీ బహిర్గతం చేయకుండా సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ, అనంతపురం జిల్లా కలెక్టర్‌తో పాటు మరో ఆరుగురు అధికారులను చేర్చి మొత్తం 9 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. రేపు ఈ పిల్ న్యాయస్థానం ముందుకు విచారణకు రానున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *