Pulivendula: కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లెక్కింది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ సజావుగా సాగలేదని, వెంటనే అక్కడ రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ (House Motion/Interlocutory Application) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. నేటి మధ్యాహ్నమే అత్యవసర విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
పులివెందులలో ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిష్పక్షపాతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాలుగు రోజుల క్రితమే ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పోలింగ్ రోజున పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం, కాన్వాయ్ అడ్డగింతలు, దాడులు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆ పాత పిటిషన్‌కు అనుబంధంగా ఇవాళ మరో తాజా పిటిషన్‌ను వేశారు.
పోలింగ్ రోజున జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, పులివెందుల మున్సిపాలిటీలో రీపోలింగ్ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై నేటి మధ్యాహ్నం హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
