crime news

Crime News: స్కూల్ క్లాస్‌రూమ్‌లోనే ఉన్మాది ఘాతుకం.. 10వ తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..!

Crime News: పాఠశాలలో అందరి కళ్లెదుటే ఓ పదో తరగతి విద్యార్థినిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శ్రీ సత్యసాయి/అనంతపురం జిల్లా పరిధిలోని రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. చెట్లను కోసే ఎలక్ట్రిక్ రంపంతో క్లాస్‌రూమ్‌లోకి చొరబడిన దుండగుడు బాలికపై విరుచుకుపడటంతో పాఠశాల ఆవరణ రక్తసిక్తమైంది.

క్లాస్‌రూమ్‌లోనే మారణహోమం.. చెయ్యి తెగి తీవ్ర గాయాలు

పాఠశాల పనివేళల్లో తోటి విద్యార్థులంతా తరగతి గదిలో ఉండగానే ఈ ఘటన జరిగింది. అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన బాలిక రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గుర్తుతెలియని వ్యక్తి కలప, చెట్లు కోసే ఎలక్ట్రిక్ రంపంతో ఒక్కసారిగా తరగతి గదిలోకి చొరబడ్డాడు.

 

బాలిక ముఖం, గొంతు, చేతులపై రంపంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో బాలిక కుడిచేయి తెగిపోగా, ముఖంపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. తోటి విద్యార్థుల కేకలు, ఆర్తనాదాలు విని టీచర్లు, స్థానికులు వెంటనే అప్రమత్తమై రక్తపు మడుగులో ఉన్న బాలికను కాపాడి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
స్కూల్ సెక్యూరిటీపై బంధువుల తీవ్ర ఆగ్రహం
పాఠశాల ప్రాంగణంలోకి అంత పెద్ద ఎలక్ట్రిక్ మిషన్‌తో దుండగుడు ప్రవేశించడంపై బాలిక బంధువులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌కి కలప కోసే మిషన్ తీసుకొస్తుంటే సెక్యూరిటీ, టీచర్లు ఏం చేస్తున్నారు? పిల్లల రక్షణ ఎక్కడ? అంటూ తీవ్రస్థాయిలో నిలదీశారు. రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్లేదని, ఎవరైనా వేధిస్తున్నట్లు తమతో ఎప్పుడూ చెప్పలేదని బాలిక మేనత్త వాపోయారు. నిందితుడు ఎంతటి వాడైనా, ఒకవేళ బంధువైనా సరే కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
పరారీలో నిందితుడు.. పోలీసుల ముమ్మర గాలింపు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్రైమ్ సీన్‌ను పరిశీలించి ఆధారాలు సేకరించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

 

దాడికి గల కారణాలు ఏంటి? పాత కక్షలా లేక ప్రేమ పేరుతో వేధించిన వ్యవహారమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తరగతి గదిలోనే ఇంతటి ఘోరం జరగడంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *