Amit Shah

Amit Shah: హైదరాబాద్‌లో అమిత్ షా ‘మహా పాదయాత్ర’ రూట్ ఖరారు

Amit Shah: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘మహా పాదయాత్ర’ రూట్ మ్యాప్ అధికారికంగా ఖరారైంది. ‘లోక్‌తంత్ర బచావో – అరాచకత హఠావో’ (ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని తరిమికొడదాం) నినాదంతో నవంబర్ 2వ తేదీ సాయంత్రం భాగ్యనగరంలో ఈ పాదయాత్రను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ పోరాట యాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యక్షంగా నడవనున్నారు.

ఖరారైన రూట్ ప్రకారం.. నవంబర్ 2న సాయంత్రం బషీర్‌బాగ్ నిజాం కాలేజ్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు, అగ్రనేతల సమక్షంలో ఈ మహా పాదయాత్ర ఘనంగా ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా మొజంజాహీ మార్కెట్ క్రాస్ రోడ్స్ వరకు యాత్ర కొనసాగుతుంది. అనంతరం యాత్ర నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుంది. అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తన ప్రసంగంతో రాజకీయ దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, తాగునీటి ఎద్దడి, ప్రజా సమస్యలు మరియు కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం, భారీ ఎత్తున జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ భారీ ర్యాలీ, సభతో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ మరింత హీటెక్కనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *