KTR

KTR: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. కరువు మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు బెటర్ అంటూ ప్రశంసలు!

KTR: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో, మరోవైపు మూసీ సుందరీకరణ పేరిట వేల కోట్లు ఖర్చు చేస్తామనడం హాస్యాస్పదమని మండిపడ్డారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల దోపిడీకి తెరలేపారని, వేలాది ఎకరాల భూములను కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (DPR) ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోనే తాగునీటి ఎద్దడి ఉంటే, మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని తెచ్చి మూసీలో పోస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ పబ్లిక్ హియరింగ్ తీరును తప్పుబడుతూ.. ప్రజాప్రతినిధులు సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, సుధీర్ రెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
‘పబ్లిక్ లేని పబ్లిక్ హియరింగ్’ నిర్వహించడం ప్రజాస్వామ్యమా లేక ఇందిరమ్మ ఎమర్జెన్సీనా అని ప్రశ్నించారు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా అని నిలదీశారు.
సాగునీటి నిర్వహణ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ పేర్కొన్నారు. గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 250 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోయినా ఎత్తిపోయలేకపోయారని విమర్శించారు. మేడిగడ్డ పిల్లర్లు పేల్చి మూడేళ్లవుతుందని, బ్లాస్టింగ్ శబ్దాలు వచ్చాయని అధికారులే చెప్పారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక, ఏపీల్లో లేని కరువు తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కరువు పరిస్థితులను చాలా సమర్థంగా మేనేజ్ చేశారని, పట్టిసీమ ద్వారా 90 టీఎంసీలు ఎత్తిపోసి, శ్రీశైలం నుంచి దాదాపు 700 కి.మీ దూరంలో ఉన్న కుప్పం వరకు కృష్ణా జలాలను తరలించారని గుర్తుచేస్తూ చంద్రబాబును కేటీఆర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *