Bengaluru: బాధ్యతాయుతమైన ఉన్నత హోదాలో ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఐఏఎస్ అధికారి పబ్‌లో మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తనిఖీలు చేయడానికి వచ్చిన పోలీసులపైనే దుర్భాషలాడుతూ, బెదిరింపులకు దిగి దాడికి యత్నించిన ఘటనలో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (కడా – KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ), ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బెంగళూరు పోలీసులు నాన్‌బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
బెంగళూరు నార్త్ పరిధిలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 150/2026 కింద నమోదైన ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఐఏఎస్ వికాస్ మర్మత్‌ను ప్రధాన నిందితుడు (A1)గా చేర్చడం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
అర్ధరాత్రి 1:30 గంటలకు పబ్‌లో ఏం జరిగింది?
నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 9వ తేదీ రాత్రి, 10వ తేదీ తెల్లవారుజామున బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు నిబంధనల ఉల్లంఘనలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కసబా, బెంగళూరు నార్త్ పరిధిలోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ‘కావోర్ బార్ అండ్ రెస్టారెంట్’ (Cavore Bar and Restaurant) నిర్దేశిత సమయం ముగిసినా నడుస్తుండటాన్ని గమనించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల సమయంలో పోలీసులు పబ్‌లోకి ప్రవేశించి, కస్టమర్ల వయస్సును ధ్రువీకరించేందుకు గుర్తింపు కార్డులను పరిశీలించడం ప్రారంభించారు.
పోలీసులపైనే అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ ఐఏఎస్..
ఆ సమయంలో పబ్‌లోనే ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ మద్యం మత్తులో విధుల్లో ఉన్న పోలీసు అధికారులు బి.ఎన్. అశోక్, మహదేవయ్యలపైకి దూసుకొచ్చారు. తామెవరో తెలుసా అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. పోలీసులను బెదిరిస్తూ, వారి విధులకు అడ్డుతగిలి భౌతిక దాడికి దిగారు.
కబ్బన్ పార్క్ పీఎస్‌లో కేసు – నలుగురిపై తీవ్ర సెక్షన్లు..
ఈ ఘటనపై సీసీబీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు అక్టోబర్ 10న ఎఫ్‌ఐఆర్ (Cr No: 150/2026) నమోదు చేశారు.
-
ఎఫ్‌ఐఆర్‌లోని నిందితులు:
-
ఏ1 (A1): వికాస్ మర్మత్ (కుప్పం కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ / ఐఏఎస్ అధికారి)
-
ఏ2 (A2): అభయ్ ఉదయ్ సింగ్
-
ఏ3 (A3): నితీష్
-
ఏ4 (A4): రోషన్
-
-
నమోదైన తీవ్ర చట్టపరమైన సెక్షన్లు (BNS 2023):కొత్త నేర చట్టం భారతీయ న్యాయ సంహిత ప్రకారం వీరిపై పలు అభియోగాలు మోపారు:
-
Section 132: విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం లేదా బలాత్కారం ప్రయోగించడం (Assault to deter public servant from duty).
-
Section 115(2): స్వచ్ఛందంగా గాయపరచడం.
-
Section 351(2): నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం.
-
Section 352: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం.
-
Section 3(5): నలుగురూ కలిసి ఉమ్మడి నేరపూరిత ఉద్దేశంతో దాడి చేయడం.
-
రెండు రాష్ట్రాల అధికార వర్గాల్లో తీవ్ర చర్చ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి బాధ్యతలను చూసే ప్రాజెక్ట్ డైరెక్టర్ స్థాయి ఐఏఎస్ అధికారి.. పక్క రాష్ట్రంలో అర్ధరాత్రి పబ్‌లో పోలీసులతో గొడవపడి, ఏ1 నిందితుడిగా కేసు ఎదుర్కోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు పబ్‌లోని సీసీటీవీ దృశ్యాలను సేకరించి, చట్టప్రకారం తదుపరి అరెస్టు ప్రక్రియపై దృష్టి సారించారు.
