Srisailam Project: తెలుగు రాష్ట్రాలకు ప్రాణప్రదమైన శ్రీశైలం జలాశయం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించింది. ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ (World Book of Records) లో శ్రీశైలం ప్రాజెక్టుకు అధికారికంగా చోటు దక్కింది. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపును సాధించిన దేశంలోనే మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టుగా శ్రీశైలం డ్యామ్ సరికొత్త రికార్డు సృష్టించింది.
శ్రీశైలంలో నిర్వహించిన కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ రీజినల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇలియాజర్.. స్థానిక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితో పాటు ప్రాజెక్టు ఇరిగేషన్ ఇంజనీర్లకు అధికారిక ధ్రువీకరణ పత్రాలను (సర్టిఫికెట్లను) అందజేశారు.
శ్రీశైలానికి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఎందుకు దక్కింది?
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ ఇలియాజర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు నిర్మాణ విశిష్టత, ఇంజనీరింగ్ నైపుణ్యమే ఈ అవార్డుకు కారణం..
దక్షిణాసియాలోనే అతిపెద్ద క్రస్ట్ గేట్లు..
మొత్తం దక్షిణాసియాలోనే ఏ ఇతర డ్యామ్‌లోనూ లేని విధంగా శ్రీశైలం జలాశయానికి 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు (60 x 55 అడుగులు) కలిగిన భారీ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉంటూ, ఇంతటి భారీ గేట్లు కలిగి ఉండటం ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది.
2009 నాటి మహా వరదను తట్టుకున్న పటిష్టత..
2009 అక్టోబర్‌లో కృష్ణా నదికి చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ వరద వచ్చింది. డ్యామ్ సామర్థ్యానికి మించి ఏకంగా 25.4 లక్షల క్యూసెక్కుల వరద నీరు డ్యామ్ పైనుంచి ఓవర్‌ఫ్లో అయినప్పటికీ.. నిర్మాణం రవ్వంత కూడా దెబ్బతినకుండా చెక్కుచెదరకుండా నిలబడింది. ఇంతటి విపత్తును తట్టుకుని ఇప్పటికీ సేవలందిస్తున్న నిర్మాణ పటిష్టతకు ఈ రికార్డు నిదర్శనం.
కోట్లాది ప్రజలకు తాగు, సాగునీరు & విద్యుత్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరు, తాగునీటితో పాటు వేల మెగావాట్ల జలవిద్యుత్‌ను అందిస్తున్న బహుళార్థసాధక ప్రాజెక్టు ఇది. సుమారు 215 టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యంతో పాటు, తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి సైతం తాగునీటిని అందిస్తూ అంతర్రాష్ట్ర జల అవసరాలను తీరుస్తోంది.
నాటి ఇంజనీర్ల శ్రమకు దక్కిన గౌరవం: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
శ్రీశైలం జలాశయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడంపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కష్టతరమైన నల్లమల కొండల నడుమ ప్రాజెక్టును అత్యంత పటిష్టంగా నిర్మించిన నాటి ఇంజనీర్లు, కార్మికుల కృషి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కొనియాడారు.
ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా పనిచేసిన ప్రస్తుత ఇరిగేషన్ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ గుర్తింపు తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
