Prakasam

Prakasam: సరదా కోసం సముద్రంలో దిగి.. ఇద్దరు యువకులు మృతి

Prakasam: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలేరమ్మ తల్లికి పొంగళ్లు సమర్పించి, భక్తిశ్రద్ధలతో సముద్ర స్నానానికి దిగిన యువకుల బృందాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. అలల ఉధృతికి ఒక్కసారిగా ఏడుగురు సముద్రంలో గల్లంతవగా.. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి ఆసుపత్రిలో అత్యంత విషమంగా ఉంది.

కనిగిరి నియోజకవర్గంలోని శ్రీరంగపురం గ్రామానికి చెందిన 15 మంది స్థానికులు శనివారం ఉదయం గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి పొంగళ్లు పెట్టేందుకు పాకాల ప్రాంతానికి వచ్చారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, వారిలోని ఏడుగురు యువకులు సరదాగా సముద్ర స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు.
క్షణాల్లో ముంచెత్తిన అలలు – రంగంలోకి మెరైన్ పోలీసులు..
తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా సముద్రంలో భారీ అల దూసుకొచ్చింది. అలల తీవ్రతకు ఏడుగురు యువకులు లోపలికి కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు, తోటి భక్తులు కేకలు వేయడంతో స్థానికంగా కలకలం రేగింది.
ఐదుగురిని ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ టీమ్..
సమాచారం అందుకున్న వెంటనే మెరైన్ పోలీస్ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. సముద్రంలోకి వెళ్లి ఐదుగురిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. అయితే, వారిలో ఒకరు అప్పటికే ఊపిరాడక మృతి చెందారు.
కందుకూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి..
  • ఒడ్డుకు చేర్చిన వారిలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
  • అక్కడ అత్యవసర చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య ముగ్గురికి చేరింది.
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
  • నీటి ప్రవాహంలో గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు, రెస్క్యూ బృందాలు బోట్లతో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
గ్రామ దేవతకు మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లిన యువకులు ఇలా సముద్ర అలల బారినపడి మృత్యువాత పడటంతో కనిగిరి శ్రీరంగపురం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *