CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ 13వ తేదీ మంగళవారం ఆయన విజయవాడకు విచ్చేసి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ఉద్దేశించిన ‘తెలుగు గంగ’ ప్రాజెక్ట్ కింద కృష్ణా జలాల విడుదల, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన సరిహద్దు నదీ ప్రాజెక్టులు, నదుల అనుసంధానం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
కృష్ణా జలాల లోటు – చర్చల్లో ప్రధానాంశం..
తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఏపీ ప్రభుత్వం సరిహద్దు వద్ద తమిళనాడుకు ఏటా 12 టీఎంసీల (TMC) కృష్ణా నదీ జలాలను సరఫరా చేయాల్సి ఉంది.
వచ్చింది 2.251 టీఎంసీలే..
అయితే ప్రస్తుత సంవత్సరంలో అక్టోబర్ 9 నాటికి తమిళనాడుకు కేవలం 2.251 టీఎంసీల నీరు మాత్రమే అందింది. ఇంకా దాదాపు 9.749 టీఎంసీల మేర లోటు ఉండటంతో చెన్నై తాగునీటి సరఫరాపై ఆందోళన నెలకొంది. ఈ మిగులు కోటాను రాబోయే రోజుల్లో విడుదల చేయాలని సీఎం విజయ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ఏపీ డ్యామ్‌ల నిర్మాణం & నదుల అనుసంధానంపై దృష్టి..
ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోకి ప్రవహించే నదులపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రతిపాదిత జలాశయాలు/చెక్‌డ్యామ్‌లపై తమిళనాడు వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దిగువ రాష్ట్రానికి వచ్చే ప్రవాహాలు తగ్గిపోతాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ అంశంపై చర్చలు జరగనున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా నదుల అనుసంధాన ప్రక్రియపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరపనున్నారు.
పవన్ కల్యాణ్‌తోనూ భేటీ – రాజకీయ ప్రాధాన్యత..
ఈ పర్యటనలో భాగంగా సీఎం విజయ్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు జలవనరుల శాఖ మంత్రులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అధికార పగ్గాలు చేపట్టిన ఇద్దరు అగ్ర నేతలు పవన్ కల్యాణ్, విజయ్ మధ్య జరగనున్న ఈ భేటీ దక్షిణ భారత రాజకీయాల్లో కూడా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గత ఆగస్టు నెలలో కావేరీ జలాల వివాదంపై చర్చించేందుకు విజయ్ కర్ణాటక పర్యటనకు సిద్ధమైనప్పటికీ.. కన్నడ సంఘాల నిరసనల నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అభ్యర్థన మేరకు ఆ పర్యటన రద్దయింది. ఇప్పుడు ఏపీ పర్యటన తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటనపై తమిళనాడు అధికార వర్గాల నుంచి మరింత అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
