Delhi Protest

Delhi Protest: కేంద్ర హోంశాఖ సంచలన ఆదేశాలు.. జంతర్ మంతర్ నిరసనకు నో ఎంట్రీ!

Delhi Protest: దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ శనివారం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఉద్రిక్తత పతాక స్థాయికి చేరింది. ఆందోళనకారులు రాజధానిలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని కీలకమైన ఘాజీపూర్ (Ghazipur) బోర్డర్ వద్ద అధికారులు భారీ కాంక్రీట్, రాతి బారికేడ్లను (Heavy stone barricades) ఏర్పాటు చేశారు. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండటంతో సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ కీలక లేఖ..

వివిధ రాష్ట్రాల నుంచి సీజేపీ మద్దతుదారులు, ఆందోళనకారులు అనధికారికంగా ఢిల్లీలోకి ప్రవేశించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా రాష్ట్రాల పోలీసులే ముందస్తుగా కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నిఘా విభాగాలు, బోర్డర్ ట్రాన్సిట్ అధికారులు, ఢిల్లీ పోలీసులతో నిరంతరం సమాచారాన్ని (Real-time intelligence) పంచుకోవాలని స్పష్టం చేశారు.
చట్టవిరుద్ధమైన సమావేశం..
అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద సామూహిక సమీకరణ కోసం సీజేపీ పెట్టుకున్న దరఖాస్తును అధికారికంగా తిరస్కరించామని, కాబట్టి ఆ ప్రాంతంలో గుమికూడటం పూర్తిగా చట్టవిరుద్ధమని కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు 2018 నాటి మార్గదర్శకాల ప్రకారం జంతర్ మంతర్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
గత హింసాత్మక చరిత్ర..
గతంలోనూ సీజేపీ, దాని అనుబంధ సంస్థలు అధికారిక ఆదేశాలను ఉల్లంఘించి నిరసనలు చేపట్టడం వల్ల ప్రజా ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని హోంశాఖ ఆరోపించింది. శాంతిభద్రతల పరిరక్షణ రాజ్యాంగబద్ధమైన ప్రధాన బాధ్యత అని, ఇందులో ఎలాంటి రాజీ ఉండదని లేఖలో తేల్చిచెప్పింది.
ఘాజీపూర్ వద్ద ఉక్కు దిగ్బంధనం..
ఉత్తరప్రదేశ్ నుంచి వేలాది మంది కార్యకర్తలు ట్రాక్టర్లు, వాహనాల్లో ఢిల్లీకి తరలివచ్చే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఘాజీపూర్ సరిహద్దులో రోడ్డును దాదాపు సీల్ చేశారు.

ఢిల్లీ సౌత్ డిస్ట్రిక్ట్ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు ఢిల్లీ నగరంలోని అంతర్గత సరిహద్దుల్లోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం గుర్తింపు కార్డులు, అత్యవసర ప్రయాణ పత్రాలు ఉన్నవారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీజేపీ ఇచ్చిన పిలుపుతో దేశ రాజధాని ప్రాంతం మొత్తం పూర్తి సైనిక వలయంలా మారిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *