Danam Nagender

Danam Nagender: ఓట్లు పునరుద్ధరించకపోతే ఈసీ ఆఫీస్‌తో పాటు హైదరాబాద్‌ను తగలబెడతాం

Danam Nagender: హైదరాబాద్ నగరంలో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఎన్నికల కమిషన్ (EC) వ్యవహారశైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ల తొలగింపుపై ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే, అర్హులైన వారి ఓట్లను వెంటనే పునరుద్ధరించకపోతే.. ఈసీ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరాన్ని తగలబెడతామంటూ అత్యంత వివాదాస్పద హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్‌నగర్ డివిజన్‌లో నిర్వహించిన సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కేవలం ఒక్క డివిజన్‌లోనే 20 వేల ఓట్లు మాయం.. బీజేపీపై ఆరోపణలు..!

ఎన్నికల సంఘం అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని దానం నాగేందర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల కమిషన్ అధికారులు కేంద్రంలోని బీజేపీ నాయకులతో కుమ్మక్కై, వారికి అనుబంధ విభాగంలా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పెద్దలు వ్యవస్థీకృతంగా ‘ఓట్ చోరీ’కి తెరతీశారని మండిపడ్డారు.

ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేవలం హిమాయత్‌నగర్ డివిజన్‌లోనే ఏకంగా దాదాపు 20,000 ఓట్లను ఏకపక్షంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2000, 2002 సంవత్సరం నుంచి అక్కడే నివాసముంటూ, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటు వేసిన స్థానికుల పేర్లను ఇప్పుడు జాబితా నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.

ఎస్ఐఆర్ (SIR) నోటీసుల పేరుతో వేధింపులు..
ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలో భారీగా నోటీసులు ఇచ్చారని, అర్హులైన పేర్లను పరిశీలించకుండానే అక్రమంగా జాబితా నుంచి తొలగించారని విమర్శించారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో పరిస్థితులు మామూలుగా ఉండవు” – దానం వార్నింగ్..
తమ నియోజకవర్గ ప్రజల ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత తనపై ఉందని, అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి అన్యాయంగా తొలగించిన పేర్లన్నింటినీ మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చాలి. లేకపోతే మా పోరాటం మరింత ఉధృతంగా ఉంటుంది. హైదరాబాద్‌లో పరిస్థితులు తీవ్రంగా మారతాయి. అవసరమైతే ఈసీ ఆఫీస్‌తో పాటు నగరాన్ని తగలబెడతాం అంటూ దానం నాగేందర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని రాజేశాయి.

ఓట్ల తొలగింపు అంశంపై అధికారికంగా ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని, అక్రమంగా ఓట్లు గల్లంతు చేసిన వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని దానం స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి నగరాన్ని తగలబెడతాం అంటూ వ్యాఖ్యానించడంపై ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పిస్తుండటంతో ఈ అంశం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *