Breaking News: ఎస్‌బీఐ (SBI) సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారం సెలవు ప్రకటించిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరుతో ఉన్న ఓ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇందుకు జతచేయడంతో సామాన్య ప్రజలు, బ్యాంకు ఖాతాదారులు నిజమేనని భ్రమపడ్డారు. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార విభాగం ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ (PIB Fact Check) తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆ గెజిట్ కాపీ పక్కా ఫేక్ అని స్పష్టం చేసింది.
ఫేక్ గెజిట్‌లో ఏముంది? – PIB వివరణ..
సెప్టెంబర్ 30, 2026 తేదీతో సర్క్యులేట్ అవుతున్న ఆ ఉత్తర్వుల్లో.. కేంద్ర ఆర్థిక శాఖలోని ఆర్థిక సేవల విభాగం (DFS) ప్రభుత్వ బ్యాంకులకు ఇకపై అన్ని శనివారాలు సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలను నమ్మించేందుకు అధికారిక ఫైల్ నంబర్, సీనియర్ అధికారి పేరును కూడా ఫోర్జరీ చేశారు.
ఆర్థిక శాఖ అలాంటి ఉత్తర్వు ఇవ్వలేదు..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన పీఐబీ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి గెజిట్‌ను జారీ చేయలేదని వెల్లడించింది. గుర్తుతెలియని వ్యక్తులు సృష్టించిన ఈ నకిలీ పత్రాన్ని నమ్మి ఎవరూ మోసపోవద్దని, దాన్ని ఇతరులకు షేర్ చేయవద్దని హెచ్చరించింది.
ప్రస్తుతం బ్యాంకులకు అమల్లో ఉన్న రూల్స్ ఇవే..
2015 నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు నెలకు రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే సెలవులు ఉంటాయి. మొదటి, మూడో మరియు ఐదో శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పూర్తిస్థాయిలో పనిచేస్తాయి.
బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని (అన్ని శనివారాలు సెలవు ఇవ్వాలని) ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతున్నాయి. దీనిపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రతిపాదనలు పంపినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
ఇటీవలి సమ్మె పరిణామాలు..
ఐదు రోజుల పని వారం డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు ఫలప్రదం కావడంతో ఆ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు ఆకతాయిలు ఫేక్ గెజిట్ సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి ఏదైనా వార్త వస్తే అధికారిక పోర్టళ్లు లేదా బ్యాంకుల ప్రకటనల ద్వారా మాత్రమే ధ్రువీకరించుకోవాలని పీఐబీ సూచించింది.

