Ongole

Ongole: ఒంగోలులో ‘ఇరుముడి’ సినిమా సీన్ రిపీట్.. !

Ongole: ‘ఇరుముడి’ సినిమాలో స్పెషల్ క్లాసుల పేరుతో అమాయక విద్యార్థినులను మోసగించి, రాజకీయ నాయకుడి వద్దకు పంపించే టీచర్ పాత్ర గుర్తుందా? సరిగ్గా అలాంటి అమానవీయ ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో నిజంగా జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. కాకపోతే ఆ సినిమాలో టీచర్ అయితే.. ఇక్కడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) హాస్టల్‌‌లో పనిచేసే వంటమనిషే పిల్లలను కాటేసే రాబందులా మారింది. హాస్టల్ విద్యార్థినులను మభ్యపెట్టి ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి పంపించడం, అక్కడ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడటం స్థానికంగా పెను దుమారం రేపుతోంది.

అసలు ఏం జరిగింది?

మభ్యపెట్టి తీసుకెళ్లిన వంటమనిషి..
ప్రకాశం జిల్లా జరుగుమల్లి కేజీబీవీ హాస్టల్‌లో పనిచేస్తున్న శారద అనే వంటమనిషి.. అక్కడి విద్యార్థినులను నమ్మించి, మాయమాటలు చెప్పి ఒంగోలులోని రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావు (వెంకటేష్) ఇంటికి తీసుకెళ్లింది. సదరు వ్యక్తి గతంలో డీఆర్‌డీఏ (DRDA) విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందినట్లు సమాచారం.
బాలికపై లైంగిక దాడి – చాకచక్యంగా తప్పించుకున్న తోటి విద్యార్థిని..
ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత వెంకట్రావు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. హద్దులు దాటి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ పైశాచికత్వాన్ని కళ్లారా చూసిన మరో విద్యార్థిని తీవ్ర భయాందోళనకు గురైంది. అయితే అక్కడే ఉంటే తమ ప్రాణాలకే ప్రమాదమని గ్రహించి, అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి బయటకు పరుగులు తీసింది. బయటకు వచ్చిన ఆ బాలిక ఏడుస్తూ స్థానికులకు విషయం చెప్పడంతో ఈ ఘోరం బట్టబయలైంది. వెంటనే రంగంలోకి దిగిన స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు ఆ నిందితుడి ఇంటికి చేరుకుని అతడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పోక్సో (POCSO) కేసు నమోదు – ప్రభుత్వ సీరియస్:
ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్రంగా స్పందించారు.నిందితుడు వెంకట్రావుపై పోలీసులు పోక్సో (POCSO) సహా పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. విద్యార్థినులను బయటకు తీసుకెళ్లిన వంటమనిషి శారదను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ తేరేసమ్మకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

విద్యార్థినులను హాస్టల్ నుంచి అసలు బయటకు ఎందుకు పంపించారు? ఈ వ్యవహారంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయా? ఇంకా ఎవరైనా మధ్యవర్తులు, సిబ్బంది హస్తం ఉందా అనే కోణాల్లో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు.కొద్ది నెలల క్రితమే ఓ వ్యక్తి మైనర్ బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లి తోటలో లైంగిక దాడికి పాల్పడటం, ఆ తర్వాత నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం వంటి సంఘటన మరువకముందే.. మళ్లీ కేజీబీవీ హాస్టల్ కేంద్రంగా ఇలాంటి దారుణం జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *