Khairatabad By Election

Khairatabad By Election: ఖైరతాబాద్ ఉపఎన్నికతో రాజధానిలో మొదలైన పొలిటికల్ హీట్.. ఎవరి లెక్కలు వారివే!

Khairatabad By Election: హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక రానుండటంతో రాజధాని రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ఎన్నో నాటకీయ పరిణామాలు, కోర్టు తీర్పుల తర్వాత ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం, ఆయన తన పదవిని కోల్పోవడం చకచకా జరిగిపోయాయి. ఖైరతాబాద్ సీటు ఖాళీ అయినట్లు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సోమవారం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.

ఈ పరిణామంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ ఎత్తులు, పైఎత్తులకు పదును పెడుతున్నాయి. ఎలాగైనా సరే ఈ ప్రతిష్ఠాత్మక స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని మూడు పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు టికెట్ దక్కించుకోవాలని ఆశావహులు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అసలు దానంపై అనర్హత వేటు ఎందుకు పడింది?

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ (బీ-ఫామ్) తీసుకుని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

స్పీకర్ నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం..
ఎమ్మెల్యేగా బీఆర్ఎస్‌లో ఉంటూనే కాంగ్రెస్ తరఫున ఎంపీగా నామినేషన్ వేయడం పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి న్యాయపోరాటం మొదలుపెట్టారు. స్పీకర్ తిరస్కరించిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టి.. దానం పార్టీ మారినట్లు స్పష్టం చేస్తూ ఆయనపై అనర్హత వేటు వేసింది.
సుప్రీంకోర్టు సమర్థన – అసెంబ్లీ గెజిట్ 
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట దక్కలేదు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఆదేశాల మేరకు దానం నాగేందర్ కాంగ్రెస్ బీ-ఫామ్ తీసుకుని నామినేషన్ వేసిన 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయనపై అనర్హత వేటు అమల్లోకి వచ్చిందని, ఆ తేదీ నుంచే ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్‌లో స్పష్టం చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలు ఎలా ఉన్నాయి?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు చూస్తే ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
  • దానం నాగేందర్ (బీఆర్ఎస్): 63,068 ఓట్లు (విజేత)
  • చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ): 34,666 ఓట్లు (రెండో స్థానం)
  • పి. విజయారెడ్డి (కాంగ్రెస్): 33,549 ఓట్లు (మూడో స్థానం)
గత ఎన్నికల్లో దానం నాగేందర్ 28,402 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. కానీ ఇప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. గెలిచిన నాయకుడు ఇప్పుడు అధికార కాంగ్రెస్‌లో ఉండటం, కోర్టు తీర్పుతో బైపోల్ రావడం వల్ల ఈసారి పోరు త్రిముఖ సమరంగా మారింది.
బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు? పార్టీల్లో మొదలైన టికెట్ ఫైట్!
1. కాంగ్రెస్ పార్టీ:
ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున మళ్లీ దానం నాగేందరే బరిలో దిగుతారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గట్టి పోటీ ఇచ్చి 33 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న దివంగత సీఎల్పీ నేత పి.జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె విజయా రెడ్డి కూడా ఈసారి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు పార్టీలోని యువ నేత రోహిన్ రెడ్డి పేరు కూడా రేసులో వినిపిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
2. బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి):
గతంలో తమ చేతిలో ఉన్న సీటును ఎలాగైనా మళ్లీ గెలుచుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పేరు ఇక్కడ బలంగా వినిపిస్తోంది. గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన మన్నె కవితారెడ్డి (మన్నె గోవర్ధన్‌రెడ్డి) కూడా టికెట్ రేసులో ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
3. భారతీయ జనతా పార్టీ (బీజేపీ):
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ బైపోల్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరోసారి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనతో పాటు మరో ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా టికెట్ కోసం లైన్లో నిలబడ్డారు.

ఎన్నికల సంఘం ఎందుకు ‘స్పెషల్ కేసు’గా చూస్తోంది? షెడ్యూల్ ఎప్పుడు?

సాధారణంగా ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే చనిపోతే లేదా రాజీనామా చేస్తే సీటు ఖాళీ అయిన 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఖైరతాబాద్ విషయంలో కోర్టు తీర్పు ఇచ్చింది 2026 సెప్టెంబర్‌లో అయినప్పటికీ.. ఆయనపై అనర్హత వేటు 2024 ఏప్రిల్ 23 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. అంటే దాదాపు రెండేళ్ల క్రితం నుంచే సీటు ఖాళీగా ఉన్నట్లు లెక్క. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం (ECI) దీనిని ఒక ‘ప్రత్యేక కేసు’గా పరిగణిస్తూ సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది.
ఎస్ఐఆర్ (SIR) ముగిసిన వెంటనే షెడ్యూల్..
ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియ జోరుగా నడుస్తోంది. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అభ్యంతరాలను తీసుకుంటూ బూత్ లెవల్ అధికారులు (BLO) నవంబరు 5 నాటికి అన్నింటినీ క్లియర్ చేయనున్నారు.
నవంబరు 9న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఓటరు లిస్టు లేకపోవడం వల్లే ఎన్నికల సంఘం ఆగాల్సి వచ్చింది. నవంబరు 9న ఫైనల్ లిస్ట్ రాగానే.. నవంబరు రెండో లేదా మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. షెడ్యూల్ ఇచ్చిన 40 రోజులకు పోలింగ్ జరగాలి కాబట్టి, డిసెంబరు రెండు లేదా మూడో వారంలోనే ఉపఎన్నిక పోలింగ్ ఉండవచ్చని సెక్రటేరియట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఒకవేళ డిసెంబర్‌లో కుదరకపోతే?

ఒకవేళ సాంకేతిక కారణాలతో డిసెంబర్‌లో సాధ్యం కాకపోతే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో (గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తర్‌ప్రదేశ్) పాటే ఖైరతాబాద్ బైపోల్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఖైరతాబాద్ ఉపఎన్నిక ముగిసిన వెంటనే హైదరాబాద్ కోర్ ఏరియాలో జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందుకే వీలైనంత త్వరగా ఈ ఎన్నిక పూర్తి కావాలని అన్ని పార్టీలూ కోరుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *