Pawan Kalyan

Pawan Kalyan: రంగంలోకి కుంకీ ఏనుగులు.. చిత్తూరులో ఆపరేషన్ గజ..!

Pawan Kalyan: చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు ప్రాంతంలో గత రెండు వారాలుగా అడవి ఏనుగుల గుంపు తిరుగుతుండటంపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో అత్యవసరంగా మాట్లాడారు. ఊళ్లలోకి వస్తున్న ఏనుగులను ఎవరికీ ఇబ్బంది లేకుండా వెంటనే అడవిలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని, అదే సమయంలో ఏనుగులకు కూడా హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

కుంకీ ఏనుగులతో ఆపరేషన్ – 5 శాఖల నిఘా..

ఊళ్లలోకి వచ్చిన ఏనుగులను వెనక్కి పంపేందుకు ముసలమడుగు క్యాంప్ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రప్పించి ఆపరేషన్ చేపట్టాలని సూచించారు. అటవీ శాఖతో పాటు హనుమాన్ టీమ్స్, పోలీసులు, రెవెన్యూ, కరెంట్ శాఖల అధికారులు కలిసి పని చేయాలని చెప్పారు. ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడైనా కరెంట్ వైర్లు తగిలి ఏనుగులకు ప్రమాదం జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు చూసుకోవాలని చెప్పారు.రాత్రి సమయాల్లో ఏనుగులు వస్తే ఊరి ప్రజలు జాగ్రత్తగా ఉండేలా మైకులు, సైరన్ల ద్వారా ముందే సమాచారం ఇవ్వాలన్నారు.

15 రోజులుగా 11 ఏనుగుల తిరుగుడు – రైతుల కష్టం:

గత 15 రోజులుగా 11 ఏనుగుల పెద్ద గుంపు, వాటి నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు దగ్గర్లోని పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. చేతికొచ్చిన పంటలను తొక్కి పాడుచేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ప్రస్తుతం పెద్ద గుంపు రోడ్డు దాటి మంగళంపేట వైపు, మిగిలిన రెండు ఏనుగులు చిత్తూరు వైపు వెళ్తున్నాయని అధికారులు చెప్పారు. దీనివల్ల పాకాల, పులిచెర్ల, చంద్రగిరి ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం..
ఏనుగుల వల్ల పంటలు పోయిన రైతుల వివరాలను అధికారులు వెంటనే సేకరించాలని, నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగా వారికి నష్టపరిహారం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ప్రజల రక్షణ, పంటలను కాపాడటం, ఏనుగులను సురక్షితంగా అడవికి పంపడంపై అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *