Bullet Trains: దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (బుల్లెట్ రైలు) ప్రాజెక్టు పట్టాలపైకి వచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సుమారు రూ. 2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ రూట్లో రెండు దశల్లో బుల్లెట్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆగస్టు 2027 నాటికి ఈ మార్గంలో తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కేవలం ఇతర దేశాల నుంచి రైళ్లను దిగుమతి చేసుకోవడమే కాకుండా.. సొంతంగా దేశీయ పరిజ్ఞానంతోనే (మేడ్ ఇన్ ఇండియా) బుల్లెట్ రైళ్లను తయారు చేసేందుకు భారత్ భారీ కార్యాచరణను సిద్ధం చేయడం విశేషం.
ముంబై-అహ్మదాబాద్ మార్గంలో మొదటగా B28 సిరీస్ రైళ్లు..
2015లో ప్రారంభమైన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ భూసేకరణ సమస్యలు, అత్యాధునిక టర్బైన్ యంత్రాల రాకలో జాప్యం కారణంగా మొదట నిర్దేశించుకున్న డెడ్లైన్ కంటే ఆలస్యమైంది. అలాగే ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా దాదాపు రెట్టింపై రూ.2 లక్షల కోట్లకు చేరింది. అయితే ఈ అడ్డంకులన్నింటినీ అధిగమిస్తూ ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతుండటంతో 2027 ఆగస్టు నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
