లైబీరియా విదేశాంగ మంత్రి సారా బెసోలో న్యాంతితో కలిసి సముద్ర రవాణా, నావికుల భద్రతపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్ బ్రీఫింగ్లో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సమావేశం కేవలం ప్రకటనల విడుదలకే పరిమితమని ముందుగానే స్పష్టం చేసినప్పటికీ.. ముగింపు సమయంలో ఓ పాకిస్థానీ రిపోర్టర్ మధ్యలో కల్పించుకున్నాడు. “పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం మీ ప్రభుత్వం ఎప్పుడు ఆపుతుంది?” అంటూ వివాదాస్పద ప్రశ్న వేసే ప్రయత్నం చేశాడు. దీనిపై జైశంకర్ ఏమాత్రం తడబడకుండా.. “ఓ ఉగ్రవాద దేశం నన్ను ఈ ప్రశ్న అడుగుతోంది.. కమాన్!” (A terrorist country is asking me that question. Come on) అంటూ వ్యంగ్యంగా, తీవ్ర స్వరంతో సమాధానమిచ్చారు.
సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ స్పష్టమైన వైఖరి..
పాకిస్థాన్ తమ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మార్చడాన్ని భారత్ ఎప్పటికప్పుడు అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతోంది. సరిహద్దు ఉగ్రవాదంపై పాక్ నిరూపించదగిన, విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి తర్వాత.. భారత్ ఆత్మరక్షణ హక్కును ఉపయోగించుకుంటూ పాకిస్థాన్, పీవోకే (PoK)లోని ఉగ్రవాద మౌలిక వసతులను ధ్వంసం చేసేందుకు ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తోంది.
ఉగ్రవాద సంస్థలపై అంతర్జాతీయ ఆంక్షలు & ఎఫ్ఏటీఎఫ్ నిఘా..
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా (LeT) ప్రాక్సీగా వ్యవహరిస్తున్న TRFను అమెరికా 2025 జూలైలో గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించింది. ఐరాస 1267 ఆంక్షల కమిటీ కూడా పహల్గామ్ దాడితో TRFకు సంబంధాలు ఉన్నట్లు నివేదించింది.
ఉగ్రవాద నిధుల కట్టడిలో విఫలమైనందుకు గతంలో పాకిస్థాన్ మూడుసార్లు ఎఫ్ఏటీఎఫ్ (FATF) గ్రే లిస్ట్‌లో నిలిచింది. ముంబై 26/11 దాడుల సూత్రధారులతో పాటు కీలక ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేలా పాక్‌ను అంతర్జాతీయ సమాజం నిరంతరం ఒత్తిడికి గురిచేస్తోంది.
ఉగ్రవాదాన్ని సాధారణ అంశంగా లేదా రాజకీయ అంశంగా చూడరాదని, అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశాల పట్ల కఠినంగా ఉండాలని జైశంకర్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉన్నారు.