Death Penalty: మహారాష్ట్రలోని ఠాణే జిల్లా భివండిలో వెలుగుచూసిన వివాహితపై సామూహిక అత్యాచారం కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సస్పెండెడ్ పోలీస్ కానిస్టేబుల్ శైలేష్ పాటిల్‌కు మరణశిక్ష విధించాలంటూ స్వయంగా అతడి కన్నతల్లే డిమాండ్ చేయడం తీవ్ర సంచలనం రేపింది. తన కుమారుడు సమాజానికే కాదు, కన్నతల్లికి కూడా తీరని అన్యాయం చేశాడని, అతడి ఆగడాలకు ఉరిశిక్షే సరైన న్యాయమని సులోచనా పాటిల్ అధికారులను కోరారు.
భివండి గ్యాంగ్‌రేప్ కేసు నేపథ్యం..
సెప్టెంబర్ 13న బాధితురాలైన ఓ వివాహితను భివండిలోని బాప్గావ్ ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు.. గన్‌తో బెదిరించి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.
ఈ కేసులో కల్యాణ్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్‌తో పాటు కానిస్టేబుల్ శైలేష్ పాటిల్‌లను నిందితులుగా చేర్చారు. ఇప్పటికే శైలేష్‌పై పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటు వేయగా, మరో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది.
తల్లి సులోచనా పాటిల్ సంచలన ఆరోపణలు
మీడియా సమావేశంలో కన్నీటిపర్యంతమైన సులోచనా పాటిల్.. తన కుమారుడి నేర ప్రవృత్తిని బయటపెట్టారు.భివండి ఘటనే కాకుండా గతంలోనూ శైలేష్ పలువురు మహిళలను తుపాకీతో బెదిరించి అకృత్యాలకు, తీవ్ర వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. సమాజంలో మహిళలకు రక్షణ ఉండాలంటే ఇలాంటి నేరస్థుడిని ఉరితీయాల్సిందేనని తేల్చిచెప్పారు.
గతంలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కాపాడేందుకు నేరాన్ని తనపై వేసుకుని శైలేష్ జైలుకు వెళ్లాడని ఆమె తెలిపారు. ఆ సమయంలో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న కరడుగట్టిన నేరస్థులతో ఏర్పడిన సంబంధాలే అతడిని పూర్తిస్థాయి క్రిమినల్‌గా మార్చేశాయని చెప్పారు.
శైలేష్ తనను సైతం కనికరించలేదని.. రివాల్వర్‌తో బెదిరించి, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఆస్తులన్నింటినీ అక్రమంగా లాక్కున్నాడని వాపోయారు. ప్రస్తుతం తాను ఉండటానికి ఇల్లు కూడా లేక కూతురి వద్ద ఆశ్రయం పొందుతున్నానని రోదించారు.
అత్యాచారం కేసులో శైలేష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించడంతో పాటు, అతడు మోసపూరితంగా లాక్కున్న తన ఆస్తులను తనకు తిరిగి ఇప్పించాలని ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
