Tragedy: అప్పటివరకు కళ్లెదుటే అల్లారుముద్దుగా ఆడుకుంటూ నవ్వులు పూయించిన తొమ్మిది నెలల పసికందును విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు కబళించింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరిస్తున్న ఎర్త్ ప్లేట్‌ను తాకడంతో పసిబాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగింది?
చిన్న మునగాల గ్రామానికి చెందిన ఇల్లెందుల రమేష్, మమత దంపతులకు తొమ్మిది నెలల కుమారుడు అవేద్ ఉన్నాడు. గురువారం సాయంత్రం బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఇంటి ఆవరణలో అమర్చిన ఎర్త్ పైపునకు స్టీల్ ప్లేట్ బిగించి ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆ ఎర్త్ ప్లేట్లోకి విద్యుత్ సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఆడుకుంటూ అటుగా వెళ్లిన చిన్నారి అవేద్.. ఏమీ తెలియక ఆ స్టీల్ ప్లేట్‌ను పట్టుకున్నాడు. దీంతో తీవ్రమైన కరెంట్ షాక్ తగిలి ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు.
ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం..
బాలుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
తొమ్మిది నెలల పసికందు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిన్న మునగాల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.
