Bank Strike

Bank Strike: దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె వేళ.. ఎస్‌బీఐ కీలక నిర్ణయం..!

Bank Strike: వారానికి 5 రోజుల పనిదినాల అమలు డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పురోగతి లేకపోవడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల్లో సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. ఈ సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయాలు ప్రకటించింది.

ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ ఊరట – ఏ ఏటీఎమ్‌లోనైనా నో ఛార్జెస్..

సమ్మె జరిగే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఎస్‌బీఐ ఖాతాదారులు ఇతర ఏ బ్యాంకు ఏటీఎమ్‌లలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు (ATM Charges) వసూలు చేయబోమని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. సమ్మె సమయంలో నగదు కొరత రాకుండా చూస్తున్నప్పటికీ, స్థానిక ఏటీఎమ్‌లలో క్యాష్ లభ్యతపై లావాదేవీలు ఆధారపడి ఉంటాయని తెలిపింది.

అత్యవసర పనుల కోసం ఆదివారం (సెప్టెంబర్ 27) బ్యాంకులు ఓపెన్..

సమ్మె కాలంలో బ్రాంచ్ ఆధారిత లావాదేవీలు ఆగిపోనున్న దృష్ట్యా.. సెప్టెంబర్ 27 (ఆదివారం) అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) సాధారణ పనిదినంలాగే పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
చెక్కులు, డీడీలు, కేవైసీ పత్రాల సమర్పణ, లోన్ సంబంధిత అత్యవసర పనులు లేదా బ్రాంచ్ సిబ్బందితో ప్రత్యక్షంగా పని ఉన్న ఖాతాదారులు సెప్టెంబర్ 27వ తేదీనే తమ పనులను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
డిజిటల్ సేవలు 24 గంటలూ యథావిధిగా అందుబాటులో..
సమ్మె కేవలం బ్యాంక్ బ్రాంచ్‌లకే పరిమితమని, ఆన్‌లైన్ డిజిటల్ చెల్లింపులకు ఎలాంటి ఢోకా లేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది:
  • యూపీఐ & నెట్ బ్యాంకింగ్: యూపీఐ (UPI) మర్చంట్ చెల్లింపులు, నగదు బదిలీలు సాధారణంగానే జరుగుతాయి.
  • ఆన్‌లైన్ లావాదేవీలు: YONO యాప్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, అలాగే NEFT, RTGS, IMPS సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.
  • 24×7 కస్టమర్ కేర్: లావాదేవీల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే సాయం కోసం 1800 1234 లేదా 1800 2100 టోల్-ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది.
“Banking doesn’t stop. Your needs don’t have to wait” అనే నినాదంతో ఎస్‌బీఐ ఈ ఏర్పాట్లను చేపట్టింది. కస్టమర్లు ముందస్తు జాగ్రత్తగా తమ డిజిటల్ బ్యాంకింగ్ యాప్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని బ్యాంకింగ్ వర్గాలు సూచిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *