Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక వైద్య పరిశోధనా కేంద్రానికి అంకురార్పణ జరిగింది. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఏర్పాటు చేయనున్న ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్’ (LVPEI) నూతన గ్లోబల్ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఘనంగా భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుధా జాస్తి, వెంకట్ జాస్తి దంపతులను మనస్ఫూర్తిగా అభినందించిన సీఎం.. అమరావతిలో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రం ప్రపంచంలోనే నంబర్ వన్ ఐ ఇనిస్టిట్యూట్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.
12 ఎకరాల్లో గ్లోబల్ క్యాంపస్ – రీసెర్చ్ సెంటర్లు..
ఎల్వీ ప్రసాద్ సంస్థ కోసం ఇప్పటికే అబ్బరాజుపాలెంలో 12 ఎకరాల భూమిని కేటాయించామని, పరిశోధనలు, విస్తరణ కోసం భవిష్యత్తులో ఇంకా అవసరమైతే మరిన్ని ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. నాలుగు దశాబ్దాల క్రితమే ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో మొదలైన ఎల్వీ ప్రసాద్ సంస్థ.. ఇప్పటివరకు 3 కోట్ల మందికి పైగా రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందించిందని కొనియాడారు.
ప్రపంచం మెచ్చే ఇన్నోవేషన్ హబ్‌గా అమరావతి.. చంద్రబాబు విజన్
కర్నూలులో భారీ ఎత్తున డ్రోన్ తయారీ హబ్ ఏర్పాటవుతోందని, రాబోయే భవిష్యత్తు అంతా ఆవిష్కరణలదేనని, ప్రతి నూతన ఆవిష్కరణకు అమరావతే ప్రధాన వేదికగా మారి రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్ర’గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
