Chandrababu

Chandrababu: జిల్లాల వారీగా వర్ష ప్రభావం.. సీఎం చంద్రబాబు హైలెవల్ రివ్యూ!

Chandrababu: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం–కవిటి మధ్య (విశాఖపట్నం–గోపాల్‌పూర్ తీర ప్రాంతాల మధ్య) తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించాయి. తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 70 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న వర్ష పరిస్థితులు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ, సంబంధిత మంత్రులు, విపత్తు నిర్వహణ ఉన్నతాధికారులతో మాట్లాడి యంత్రాంగాన్ని పూర్తి అప్రమత్తం చేశారు.

జిల్లాల వారీగా వర్ష ప్రభావం – తీవ్ర హెచ్చరికలు..

  • ఉత్తర కోస్తా, మన్యం జిల్లాల్లో కుండపోత:
    శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
  • ఉభయ గోదావరి & కోస్తా జిల్లాలు:
    కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
  • మధ్య కోస్తా & రాయలసీమ:
    గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
  • 261 మండలాల్లో వర్ష ప్రభావం:
    రాష్ట్రవ్యాప్తంగా 129 మండలాల్లో భారీ వర్షాలు, 9 మండలాల్లో అతి భారీ వర్షాలు, 2 మండలాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వర్షాలు రాబోయే 24, 25 తేదీల్లోనూ కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఆకస్మిక వరదల ముప్పు – సీఎం చంద్రబాబు ఆదేశాలు..

ఉత్తర కోస్తా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లి ఆకస్మిక వరదలు (Flash Floods) వచ్చే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు.

ముప్పు పొంచి ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని సీఎం ఆదేశించారు.

నదులు, ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని, రిజర్వాయర్ల వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను బ్యాలెన్స్ చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులకు నిర్దేశించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలోనే ఉంటూ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *