AP News: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (TDP) కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడి ఘటనతో సంబంధం ఉన్న ప్రధాన నిందితులందరిపై రౌడీషీట్లు తెరవాలని నిర్ణయించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (రఘురాం) సహా మొత్తం 51 మంది నిందితులపై రౌడీషీట్లు ఓపెన్ చేయాల్సిందిగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడలో శాంతిభద్రతలపై పోలీసుల ఉక్కుపాదం..
ఇటీవల విజయవాడలోని శాప్ (SAAP) కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ అభ్యర్థులు, ఉపాధ్యాయులపై జరిగిన భౌతిక దాడి ఘటనను సీపీ రాజశేఖరబాబు తీవ్రంగా పరిగణించారు. ప్రజాస్వామ్యయుతంగా తమ సమస్యలపై నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, వారిపై భౌతిక దాడులకు పాల్పడి నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.
మంగళగిరి దాడి నిందితులపై కొరడా
గతంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన విధ్వంసకర దాడిలో కీలక పాత్ర పోషించిన వారితో పాటు, వరుసగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
51 మందిపై రౌడీషీట్లు – రాజకీయ వర్గాల్లో కలకలం
ఈ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న ముఖ్య నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రఘురాంతో పాటు మిగిలిన 49 మంది అనుచరులు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవనున్నారు. రౌడీషీట్ నమోదు కావడంతో నిందితులందరి కదలికలపై నిరంతరం నిఘా ఉండటంతో పాటు, వారు క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్లలో హాజరు కావాల్సి ఉంటుంది.
రౌడీషీట్ల నమోదు ప్రక్రియతో పాటు ఈ అల్లర్ల వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్ర, పన్నాగాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
