Aadarsha Kutumbam

Aadarsha Kutumbam: కాస్త ఆలస్యంగా వస్తున్నాం.. కానీ వినోదం మాత్రం తగ్గదు..!

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (#Venky77) రిలీజ్ విషయంలో మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త తేదీ ప్రకారం ఈ సినిమా  అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఆలస్యంగా వస్తున్నాం.. కానీ బ్లాక్‌బస్టర్ వినోదం ఖాయం..

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎలాంటి రాజీ పడకుండా అత్యుత్తమ క్వాలిటీతో ప్రేక్షకులకు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీనికితోడు పండుగ సెలవుల కాలాన్ని బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేలా మేకర్స్ ఈ వ్యూహాత్మక మార్పు చేశారు.
“కాస్త ఆలస్యంగా వస్తున్నాం.. కానీ అందించే వినోదం మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో బద్దలవుతుంది” అని చిత్ర యూనిట్ అభిమానులకు గట్టి హామీ ఇచ్చింది.
భారీ తారాగణం – ఆకాశాన్నంటుతున్న అంచనాలు..
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 77వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. కుటుంబ కథా చిత్రాలకు తనదైన మార్కు పంచ్ డైలాగులు, ఎమోషన్లు జోడించడంలో త్రివిక్రమ్ దిట్ట కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆది నుంచే భారీ హైప్ ఉంది.
ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా హీరో నారా రోహిత్ ఒక ప్రత్యేకమైన కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్. తమన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. వారం ఆలస్యంగా అక్టోబర్ 9న థియేటర్లలోకి రానున్న ఈ ‘ఆదర్శ కుటుంబం’ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *