Suicide: హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మనస్పర్థల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో రెండున్నరేళ్ల వయసున్న కవల పిల్లలు (ట్విన్స్) తల్లి ప్రేమకు దూరమై అనాథలుగా మిగిలారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక సంతోషి (28), విశాఖపట్నానికి చెందిన రమాకాంత్ గతంలో ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. మౌనిక యాక్సిస్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, భర్త రమాకాంత్ ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌లో హెచ్‌ఆర్ (HR) విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఘట్‌కేసర్ పరిధిలోని పోచారం మున్సిపల్ డివిజన్‌లోని ‘గెలాక్సీ టవర్స్’ అపార్ట్‌మెంట్‌లో వీరు నివాసముంటున్నారు.
దంపతుల మధ్య గత కొంతకాలంగా పిల్లల సంరక్షణ, పెంపకం విషయమై తరచూ మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు, పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి కూడా పిల్లల విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక క్షణికావేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
